మెదక్ జోన్ : మెదక్ జిల్లాలో హెచ్‌ఐవి కేసులు పెరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం .... గతేడాది 4,931 మంది హెచ్‌ఐవి బాధితులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5,402కు చేరింది. ఏడాది కాలంలో 471 కేసులు అదనంగా నమోదయ్యాయి. అయితే అధికారికంగా నమోదైన కేసుల కంటే వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే వారితోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య కూడా ఉండటంతో పూర్తి వివరాలు అధికారిక రికార్డుల్లోకి రావడం లేదని పేర్కొంటున్నారు.
రెండు నెలలపాటు విస్తృత అవగాహన ....
జిల్లాలో హెచ్‌ఐవి వ్యాప్తిని అరికట్టడంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు బుధవారం నుంచి రెండు నెలలపాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హెచ్‌ఐవి కేసులు అధికంగా ఉన్నట్లు గుర్తించిన 34 గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్నారు. బాధితుల గోప్యతకు భంగం కలగకుండా హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధులపై ప్రజలకు వివరించనున్నారు.
విద్యార్థులతో ర్యాలీలు ....
హెచ్‌ఐవి నియంత్రణలో భాగంగా విద్యార్థులను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించారు. 8వ తరగతి నుంచి హైస్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు హెచ్‌ఐవీపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులతో కలిసి గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ....
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు నెలలపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మెదక్ డీఎంహెచ్‌ఒ గణేశ్వర్ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. హెచ్‌ఐవీ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
రక్షణ లేని లైంగిక సంబంధాలతో ....
హెచ్‌ఐవి ప్రధానంగా రక్షణలేని లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెచ్‌ఐవి ఉన్న తల్లి నుంచి గర్భధారణ, ప్రసవ సమయంలో లేదా తల్లిపాలు ఇచ్చే సమయంలో శిశువుకు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణకు చేయించుకోవాల్సిన పరీక్షలు, హెచ్‌ఐవి తో జీవిస్తున్న వారిపట్ల అనుసరించాల్సిన వైఖరి, వైద్యుల సూచనల మేరకు మందుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల్లో ప్రజలకు వివరించనున్నారు.







కామెంట్‌లు (0)