ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుప్పకూలిన ఏడంతస్తుల భవనం - టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్

1 గంట క్రితం

Seven-storey building collapses – Town planning officer suspended.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

కొండాపూర్ (తెలంగాణ) : హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన గ్రౌండ్‌ ప్లస్‌ ఆరు అంతస్తులు, పెంట్‌హౌస్‌ ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసి) చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ సర్కిల్‌–50 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ప్రొఫెషనల్ ఆఫీసర్‌ (టీపీబీఓ) యు సంతోష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ సిఎంసి కమిషనర్‌ జీ శ్రీజన ఆదేశాలు జారీ చేశారు.


అనధికారికంగా కొనసాగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవడంలో అధికారి విఫలమయ్యారని, దీంతో ప్రాణనష్టం సంభవించడంతో పాటు పక్కనే ఉన్న భవనం దెబ్బతిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో సంతోష్‌ కుమార్‌ సస్పెండ్‌ తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. సస్పెన్షన్‌ కాలంలో ఆయన హెడ్‌క్వార్టర్స్‌ స్థానిక పరిధిలోనే ఉండాలని, ఉన్నతాధికారి ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌ కాలానికి జీవన భృతి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


భవన నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు …

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవన యజమానులు ఫర్హీన్ సిద్ధిఖ్, మహ్మద్ సాజిద్‌లు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నాణ్యత లేని నిర్మాణ సామగ్రి, సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం వల్లే భవనం కూలినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పక్క భవనంలోని ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.


అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అంజయ్యనగర్‌కు చెందిన సాజిద్‌ స్థానిక మాజీ కార్పొరేటర్‌కు అనుచరుడిగా చెలామణి అవుతున్నాడు. స్థానికంగా స్థల యజమానులు, బిల్డర్లకు దళారీగా వ్యవహరిస్తూ అధికారుల నుంచి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా వ్యవహారాలను చక్కబెడుతుంటాడు. కొంతకాలంగా తానే బిల్డర్‌గా అవతారమెత్తి చిన్న చిన్న ప్లాట్లు కొని భవనాలు కట్టి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ భవనమే శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఉమేశ్‌కార్‌(34), మోపత్‌(42) ఈఘటనలో మృతి చెందారు. వీరిలో ఒకరు ఎలక్ట్రీషియన్‌ కాగా, మరొకరు టైల్స్‌ పనిచేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ భవనం పక్కనే ఉన్న జయదర్శిని రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ వైపు కూలడంతో కొంత దెబ్బతిన్నది. భవన శిథిలాలు పడటంతో నాలుగో అంతస్తులో ఉన్న దంపతులు రమణారెడ్డి, సంయుక్త గాయపడ్డారు. వీరిని స్థానిక దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై స్పష్టత రాలేదు. మున్సిపల్‌, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు డ్రోన్‌లతో పాటు జాగిలాలను రంగంలోకి దింపారు. అయితే ఘటన జరిగిన వెంటనే బిల్డర్‌ సాజిద్‌ పరారైనట్టు తెలుస్తున్నది. దీంతో పోలీసులు సాజిద్‌పై కేసు నమోదుచేశారు. నాలాలపై నిర్మించిన కొన్ని భవనాలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోనందుకు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్