బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే కరెంటు కోతలు : కెటిఆర్‌

1 గంట క్రితం

‌కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే కరెంటు కోతలు
- బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల మూత
- జెన్‌‌కోకు నాసిరకం బొగ్గు సరఫరాతో రూ.2,900 కోట్ల నష్టం
- నేడు బిఆర్‌ఎస్‌ బృందాల పవర్‌‌ప్లాంట్ల సందర్శన : కెటిఆర్‌
 ప్రజాశక్తి -హైదరాబాద్‌  బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:05 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల మూత

- జెన్‌‌కోకు నాసిరకం బొగ్గు సరఫరాతో రూ.2,900 కోట్ల నష్టం

- నేడు బిఆర్‌ఎస్‌ బృందాల పవర్‌‌ప్లాంట్ల సందర్శన


ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే కరెంటు కోతలని ‌బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కెటిఆర్‌) విమర్శించారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ‌నిలిపేస్తున్నారని అన్నారు. నీటి కొరత వల్ల జల విద్యుత్‌ కేంద్రాలు కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. ఇప్పుడే విద్యుత్‌ ‌కోతలు ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ‌కేంద్రాల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు గురువారం ఆరు బిఆర్‌ఎస్‌ బృందాలు రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నాయని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కెటిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కరెంట్‌ విలాస వస్తువు కాదనీ, జీవనరేఖ అని అన్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఐటీ రంగం, గృహ అవసరాలు అన్నింటికీ విద్యుత్‌ అత్యంత కీలకమని చెప్పారు. విద్యుత్‌ సమస్యపైనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాది పడిందని గుర్తుచేశారు.


​తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఉందని కెటిఆర్‌ ‌వివరించారు. ‌బిఆర్‌ఎస్‌ హయాంలో 19,472 మెగావాట్లకు పెంచామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయానికి ఆరు గంటలకు మించి కరెంట్‌ సరఫరా కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు చేస్తున్నారని వివరించారు.


సోషల్‌ మీడియాలో ఇప్పుడు ‘80స్‌ ట్రెండ్‌’ నడుస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం 1980ల నాటి విద్యుత్‌ పరిస్థితులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెచ్చిందని కెటిర్‌ అన్నారు. అప్పట్లో రైతులు విద్యుత్‌ కోసం పడిన ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని చెప్పారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి, క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని ఆరోపించారు. ​విద్యుత్‌ సంక్షోభానికి ఎల్‌నినో ప్రభావం కారణం కాదని, ఎల్‌ ‌కాంగో (కాంగ్రెస్‌) ‌ప్రధాన కారణమని విమర్శించారు. విద్యుత్‌ సంక్షోభానికి సింగరేణి బొగ్గు సరఫరా వ్యవస్థ కూడా ఒకటని అన్నారు. జెన్‌కోకు నాసిరకం బొగ్గును సరఫరా చేస్తున్నదని చెప్పారు. దీంతో సింగరేణికి రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, సుమారు రూ.1,600 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బొగ్గు నిల్వలు ఉంటే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు ఎందుకు నిలిచిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.


సింగరేణి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఫుట్‌బాల్‌ ఆట ఆడుతోందని అన్నారు. సింగరేణితో కార్మికులు, రైతులు, ప్రజలు ఆటలాడే పరిస్థితి రావొద్దని కోరారు. సింగరేణిలో సైట్‌ విజిటేషన్‌ సర్టిఫికెట్ల పేరుతో అక్రమాలు, సోలార్‌ పవర్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయని విమర్శించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70 మిలియన్‌ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్‌ టన్నులకు ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు.


​విద్యుత్‌ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆరు బీఆర్‌ఎస్‌ బృందా‌లు గురువారం పవర్‌ స్టేషన్లను సందర్శిస్తాయని చెప్పారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చెన్నూరు నియోజకవర్గం జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్‌ జాదవ్‌ల బృందం సందర్శిస్తుందని వివరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ పరిశీలిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, ఎల్‌ ‌రమణ, ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, పాడి కౌశిక్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎ జీవన్‌‌రెడ్డి, బాల్క సుమన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్