హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో ఎవరి ఓట్లు ఉంచాలనేదానిపై బిజెపి కార్యాలయం నుంచి లిస్ట్ వెళుతోందని సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ... బతికుండగానే ఓట్లను తొలగించారని కొందరు చెబుతున్నారని అన్నారు. ఎవరి ఓట్లు ఉంచాలన్నది బిజెపి కార్యాలయం నుంచి లిస్ట్ వెళుతోందని, ఆ పార్టీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నాయని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేశారు ? కేంద్ర హోం శాఖ ఏం చర్యలు తీసుకుంది ? అని ప్రశ్నించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన SIR ప్రక్రియలోని తీవ్రమైన లోపాల దృష్ట్యా ... ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023 ద్వారా సవరించబడిన ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ని విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కర్నాటకలోని 23 జిల్లాల్లో దాదాపు 100 పోలింగ్ బూత్‌లలో తాము క్షేత్రస్థాయి పరిశీలన చేయగా, లక్షలాదిమంది అర్హులైన ఓటర్ల పేర్లను నిరంకుశంగా ఏకపక్షంగా తొలగించారని వెల్లడయ్యిందన్నారు. ముఖ్యంగా పేదలు, ఆదివాసీలు, మహిళల ఓట్లను ఎక్కువగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. '' అధికారంలో ఎవరు ఉండాలో ... ప్రజలు నిర్ణయిస్తారా ? లేక ఎవరు ఓటు వేయాలో మీరే నిర్ణయిస్తారా ? `` అని నరేంద్ర మోడి, అమిత్ షా లను నిలదీశారు. కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR)లో పేద ప్రజలు, ఆదివాసీలు, మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. కేంద్రం మనుస్మృతిని అమలుచేయడానికి ప్రయత్నిస్తోందా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, పాత ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2023 నుంచి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అన్ని ఫైళ్లను సుప్రీం కోర్టు స్వాధీనం చేసుకుని విచారణ జరపాలని ప్రకాష్ రాజ్ కోరారు.
ఎవరి ఓట్లు ఉంచాలన్నది బిజెపి కార్యాలయం నుంచి లిస్ట్ వెళుతోంది : ప్రకాష్ రాజ్
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)