శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అవగాహన.. అప్రమత్తతే ముఖ్యం !

-849 నిమిషాల క్రితం

Awareness and vigilance are key!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 07:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

చర్మంపై పొలుసుల్లా ఏర్పడే మచ్చలు.. దురద.. ఎర్రటి దద్దుర్లు.. ఇవి కనిపించగానే చాలామంది ఆందోళనకు గురవుతారు. మరికొందరు ఇతరులకు ఈ వ్యాధి అంటుకుంటుందేమోనని బాధితులకు దూరంగా ఉంటారు. కానీ సోరియాసిస్ విషయంలో ఇలాంటి అపోహలు అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు. చర్మ కణాల పెరుగుదల ప్రక్రియలో మార్పులు, రోగనిరోధక వ్యవస్థలో తలెత్తే అసాధారణ ప్రతిస్పందనలతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక చర్మవ్యాధి. సరైన అవగాహన, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స, జీవనశైలిలో తగిన మార్పులతో వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 29న ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

ఈ వ్యాధితో జీవిస్తున్నవారి సమస్యలను సమాజం దృష్టికి తీసుకురావడం, వ్యాధిపై అవగాహన పెంచడం, చికిత్స ప్రాధాన్యాన్ని తెలియజేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశాలు. చర్మంపై కనిపించే మచ్చలకే పరిమితం కాకుండా బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


సోరియాసిస్ అంటే ఏమిటి ?

సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మవ్యాధి. సాధారణంగా చర్మ కణాలు క్రమంగా పెరిగి, పాత కణాలు తొలగిపోతుంటాయి. అయితే సోరియాసిస్ ఉన్నవారిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. దీంతో చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్లటి లేదా వెండి రంగు పొలుసులు ఏర్పడవచ్చు. మోచేతులు, మోకాళ్లు, తలపై చర్మం, నడుము భాగం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించినప్పటికీ శరీరంలోని ఇతర భాగాల్లోనూ రావచ్చు. ఈ వ్యాధి కొందరిలో స్వల్పంగా ఉంటే, మరికొందరిలో విస్తృతంగా వ్యాపించవచ్చు. కొంతకాలం లక్షణాలు తగ్గి, తిరిగి పెరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయకుండా చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించడం మంచిది.


లక్షణాలను గుర్తించాలి

చర్మంపై ఎర్రటి మచ్చలు, వాటిపై పొలుసులు, దురద, పొడిబారడం, చర్మం పగిలి రక్తం రావడం వంటి లక్షణాలు గుర్తించాలి. కొందరిలో గోళ్ల రంగు, ఆకారం మారడం, గోళ్లు మందంగా మారడం, గోరు వేరుపడటం జరుగుతుంది. మరికొందరిలో కీళ్ల నొప్పులు, వాపులు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటే వైద్య సలహా తీసుకోవాలి.


అంటువ్యాధి కాదు..

సోరియాసిస్ ఉన్నవారిని తాకడం, పక్కన కూర్చోవడం, కలిసి భోజనం చేయడం లేదా ఒకే ప్రదేశంలో ఉండడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదు. అయినప్పటికీ అవగాహనా లోపంతో బాధితులను దూరంగా ఉంచడం, వారి రూపాన్ని చూసి ఎగతాళి చేయడం, వివక్ష చూపడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇది బాధితుల్లో ఆత్మన్యూనత, ఒంటరితనం, ఆందోళనకు కారణమవుతుంది. చర్మంపై మచ్చలు కనిపించడం వల్లనే ఒక వ్యక్తి ఆరోగ్యం, వ్యక్తిత్వం గురించి నిర్ణయించకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు బాధితులకు అండగా నిలవాలి. సామాజిక అవగాహన పెరిగినప్పుడే ఇలాంటి వివక్షను తగ్గించగలం.


చికిత్సతో నియంత్రణ సాధ్యమే

సోరియాసిస్ కు అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన శరీర భాగాలు, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు ఉపయోగించడం, వైద్యులు సూచించిన మందులు, అవసరాన్ని బట్టి కాంతి చికిత్స (Phototherapy), ఇతర ఆధునిక చికిత్సలు దోహదపడతాయి. వైద్యుల సూచన లేకుండా మందులు వాడటం, ఇతరులు సూచించిన క్రీములు రాసుకోవడం, చికిత్సను మధ్యలోనే ఆపేయడం వంటివి చేయకూడదు. దీర్ఘకాలిక వ్యాధి కావడంతో క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణ అవసరం.


ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం

సమతుల ఆహారం, తగినంత నిద్ర, శారీరక వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించుకోవడం సాధారణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయపు నడక, యోగా, ధ్యానం వంటి అలవాట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే వ్యాయామం చేసే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. పొగ తాగడం, అధిక మద్యపానం సోరియాసిస్ తీవ్రతతో సంబంధం కలిగి ఉండవచ్చు. అందువల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది. అధిక బరువు ఉన్నవారు దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడి కొందరిలో వ్యాధి లక్షణాలు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి విశ్రాంతి, కుటుంబ సహకారం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడమూ ముఖ్యం.

011


ఆహారం విషయంలో అప్రమత్తత

సోరియాసిస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే రకమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత లక్షణాలు పెరుగుతున్నట్లు అనిపిస్తే, ఆహారపు అలవాట్లను గమనించి వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. పోషకాలు అందించే ఆహార పదార్థాలను అనవసరంగా పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు తలెత్తవచ్చు. తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి పోషకాహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం మంచిది. స్వీట్లు, అధిక చక్కెర ఉన్న పానీయాలు, అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని పరిమితం చేయడం సాధారణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తమ వైద్యుల సూచనల ప్రకారం ఆహార నియమాలను పాటించాలి.


​ సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి తగిన చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. వ్యక్తిగతంగా ఏ ఆహారం పడటం లేదనే అనుమానం ఉంటే వైద్యుల సలహాతోనే ఆహార మార్పులు చేసుకోవాలి. ఇతరుల అనుభవాలు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని స్వయంగా మందులు వాడకూడదు.

logo


అవగాహనే బాధితులకు అండ

సోరియాసిస్ కేవలం చర్మానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా పడవచ్చు. అందువల్ల బాధితులకు వైద్య చికిత్సతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సమాజం నుంచి గౌరవం, సహకారం అవసరం. ప్రపంచ సొరియాసిస్‌ దినోత్సవం సందర్భంగా వ్యాధిపై ఉన్న అపోహలను తొలగిద్దాం. బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవీయంగా వ్యవహరిద్దాం. సరైన వైద్య సలహా, శాస్త్రీయ అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలితో సోరియాసిస్ నియంత్రించుకోవచ్చనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేద్దాం.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి ?

చర్మంపై మచ్చలు పెరుగుతున్నప్పుడు, దురద లేదా నొప్పి ఎక్కువైనప్పుడు, గోళ్లలో మార్పులు కనిపించినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. కీళ్ల వాపు, నొప్పి లేదా ఉదయం కీళ్లు బిగుసుకుపోవడం ఉంటే ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో పెద్ద భాగానికి వేగంగా ఎర్రదనం వ్యాపించడం, విస్తృతంగా చర్మం ఊడిపోవడం, జ్వరంతో పాటు తీవ్రమైన చర్మ మార్పులు రావడం వంటి లక్షణాలు ఉంటే అత్యవసర వైద్య సహాయం అవసరం.

0333

థీమ్‌ ...

ఈ ఏడాది థీమ్‌.. “నా చర్మాన్ని దాటి చూడండి.”ఈ సంవత్సరం ప్రచారం ప్రత్యేకంగా సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న యువతపై దృష్టి సారిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి వారి చర్మానికి మించి అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. కంటికి కనిపించే మచ్చలు, పదేపదే వచ్చే వ్యాధి తీవ్రతలు లేదా కీళ్ల లక్షణాలు వారి ఆత్మవిశ్వాసం, సామాజిక సంబంధాలు, పాఠశాల లేదా కళాశాల జీవితం, ఉద్యోగం, సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. కొంతమంది యువకులు అవాంఛిత ప్రశ్నలు, తేరిపార చూడటం లేదా సోరియాసిస్ అంటువ్యాధి అనే అపోహలను కూడా ఎదుర్కోవచ్చు.

​“లుక్ బియాండ్ మై స్కిన్” ప్రచారం ద్వారా, కంటికి కనిపించే లక్షణాలకు అతీతంగా వ్యక్తిని చూడాలని, అలాగే సోరియాసిస్‌తో జీవించడం వల్ల కలిగే శారీరక, భావోద్వేగ, సామాజిక ప్రభావాలను అర్థం చేసుకోవాలని IFPA ప్రజలను ప్రోత్సహిస్తుంది.

​ఈ ప్రచారం అవగాహన, సకాలంలో రోగ నిర్ధారణ, సరైన చికిత్స, వివక్షను తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. తద్వారా సోరియాసిస్ ఉన్నవారు తమ చర్మం కనిపించే తీరు కారణంగా ఎటువంటి విమర్శలకు గురికాకుండా సంరక్షణ పొందగలరు.


యువతకు..

ప్రతి సంవత్సరం అక్టోబర్29నఅంతర్జాతీయ సోరియాసిస్ అసోసియేషన్ల సమాఖ్య (IFPA)ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది (2026)క్యాంపెయిన్ ప్రధానంగా సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నయువత(18నుండి35సంవత్సరాల వయస్సు గలవారు)ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

జీవితంలో కీలకమైన చదువు, ఉద్యోగ దశల్లో ఉన్న యువత ఈ వ్యాధి వల్ల తీవ్ర ఆత్మన్యూనతకు, సామాజిక దూరం కావడానికి లోనవుతున్నారు.వారిని కేవలం ఒక రోగిగా కాకుండా, సమాన ప్రతిభ గల వ్యక్తులుగా గుర్తించడమే ఈ థీమ్ ఉద్దేశం. వైద్య చికిత్సతో పాటు సామాజిక ఆదరణ, మానసిక మద్దతు లభించినప్పుడే వీరు సాధారణ జీవితాన్ని గడపగలరు.


photo

పి. బకష్‌

అనువంశిక చర్మవ్యాధుల వైద్యులు

94410 77816

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్