• సంఘం స్వతంత్ర బలం పెంచాలి
• మరింతగా విస్తరించాలి
• రైతాంగ ఉద్యమాలకు దిక్సూచి కావాలి
• ప్రతినిధుల సభ ప్రారంభోపన్యాసంలో అశోక్ ధావలే పిలుపు
• నల్గొండలో ఉత్తేజంగా ప్రారంభమైన ఎఐకెఎస్ మహాసభ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - సారంపల్లి మల్లారెడ్డి నగర్ (నల్గొండ) : ప్రపంచంలో, దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రైతులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపునిచ్చారు. సంఘం స్వతంత్ర బలం పెంచాలని, మరింతగా విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. నల్గొండలో నవంబర్ 15-18 నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఎఐకెఎస్ 36వ మహాసభను పురస్కరించుకొని ఆదివారం నగరంలో ప్రదర్శన, భారీ బహిరంగసభ నిర్వహించగా, సోమవారం ప్రతినిధుల సభ, మహాసభ ‘ఎఐకెఎస్ వర్థిల్లాలి, రైతాంగ పోరాటాలు వర్థిల్లాలి’ అనే నినాదాల హోరు మధ్య ఉత్తేజభరితంగా ప్రారంభమైంది. సంఘం పతాకాన్ని అశోక్ ధావలే ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. ఎఐకెఎస్ జాతీయ నాయకత్వం, ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, సానుభూతిపరులు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ అధ్యక్షత వహించారు. మహాసభ జరుగుతున్న జిఎం గౌడ్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణానికి ఇటీవల మరణించిన రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నగర్‌గా, మహాసభ జరుగుతున్న హాల్‌కు కేరళ మాజీ సిఎం విఎస్ అచ్యుతానందన్, వేదికకు సీనియర్ రైతు నాయకులు శంకరయ్య పేరిట నామకరణం చేశారు.36వ మహాసభకు చిహ్నంగా 36 రైతు సంఘం జెండాలను ఏర్పాటు చేశారు. ధావలే ప్రారంభోపన్యాసం చేస్తూ... రాబోయే రోజుల్లో సైద్ధాంతిక, రాజకీయ, సాంస్కృతిక, రంగాలలో నిరంతర, వినూత్నమైన, శక్తివంతమైన పోరాటాలను కొనసాగించాలని, ఆ దిశలో గట్టి కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ‘రైతాంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న ఎఐకెఎస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. కోటీ 58 లక్షల సభ్యత్వం కలిగి 27 రాష్ట్రాల్లోని 459 జిల్లాలకు విస్తరించిన దేశంలోని అతిపెద్ద రైతు సంఘం ఎఐకెఎస్. రాజకీయ రంగంలో, మన దేశానికి, మన ప్రజలకు ప్రధాన శత్రువైన ఆర్‌ఎస్‌ఎస్ - బిజెపి కూటమిని ఓడించడానికి, దానికి ప్రత్యా మ్నాయంగా ఉన్న వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ఆర్‌ఎస్‌ఎస్ - బిజెపి ప్రతిఘాత విధానాలను ఓడించడానికి కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికుల అన్ని సంఘాలనూ భారీ పోరాటాలలో ఏకం చేయాలి. ఈ కర్తవ్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే జాతీయ సార్వభౌమత్వం, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, ప్రజల సామాజిక - ఆర్థిక హక్కులు, జీవనోపాధిని కాపాడగలం. మరోవైపు, వామపక్షాల, ప్రత్యేకించి ఎఐకెఎస్ స్వతంత్ర బలాన్ని పెంచడానికి ఎటువంటి అవకాశాన్నీ విడిచిపెట్టకూడదు. దీనిని సాధిం చడం ద్వారా మాత్రమే నిజమైన సమూల సామాజిక - ఆర్థిక, రాజకీయ పరివర్తన సాధ్యమవుతుంది. ఆందోళన, ప్రచారం, సంస్థాగత నిర్మాణం - ఏకీకృతం చేసి, సమర్థవంతంగా అమలు చేయాలి.’ అని ధావలే అన్నారు.
సామ్రాజ్య వాదంపై పోరు
లౌకిక, సమాఖ్య, సామ్యవాద భారతదేశం కోసం పోరాటాన్ని మరింత దృఢ సంకల్పంతో, శ్రమజీవులైన కోట్లాది మంది ఐక్యతను సాధించడం ద్వారా కొనసాగించాలని అశోక్ ధావలే సూచించారు. ‘దీనిలో భాగంగా ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే భారీ ప్రజా పోరాటాలు, సామ్రాజ్యవాదం, నయా ఉదారవాదం, నయా ఫాసిజం, మతతత్వం, కులతత్వం, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే సంఘటిత రాజకీయ - సైద్ధాంతిక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. స్పష్టమైన ప్రత్యామ్నాయమైన సోషలిజం సాధన లక్ష్యంగా ఆ కృషి ఉండాలి. కార్మిక - రైతు ఐక్యత వర్ధిల్లాలి, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య - సంవాదం వర్ధిల్లాలి.’ అని ఆయన పిలుపునిచ్చారు.
అధికారంలో బిజెపి కొనసాగితే ప్రమాదం
బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కొనసాగడం పేదలు, శ్రామిక ప్రజలు, అన్ని వర్గాల వారిపై మరింత తీవ్రమైన దాడులకు దారి తీస్తుందని అశోక్ ధావలే అన్నారు. ‘దీనివల్ల దేశీయ విదేశీ కార్పొరేట్ మిత్ర సంస్థలు మరింతగా లాభపడతాయి, సామ్రాజ్యవాద శక్తుల ముందు మరింత బానిసత్వంతో కూడిన లొంగుబాటు చోటుచేసుకుంటుంది. ఆర్‌ఎస్‌ఎస్ ఒక ఫాసిస్ట్ సంస్థ; హిట్లర్, ముస్సోలినీలు దీనికి ఆదర్శం. కాబట్టి, ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సార్వభౌమాధికారం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక - ఆర్థిక న్యాయాలతో పాటు మొత్తం భారత రాజ్యాంగానికే ముగింపు పలుకుతుంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, సంఘ్ పరివార్‌లను ఎలాగైనా అడ్డుకోవాలి. ఇందుకోసం, వారికి వ్యతిరేకమైన లౌకిక శక్తులన్నింటినీ ఏకం చేయాలి, వామపక్ష శక్తులను బలోపేతం చేయాలి’ అని చెప్పారు.
సంతాప తీర్మానం
గత మహాసభ నుంచి ఇప్పటి వరకు మరణించిన ఎఐకెఎస్ నాయకులకు, పలు రంగాల్లోని ప్రముఖులకు మహాసభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని ఎఐకెఎస్ నాయకులు డి రవీంద్రన్ ప్రవేశపెట్టగా, మహాసభ ఆమోదించింది. మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాకేష్ తికాయత్, ఎఐకెఎస్ (అజయ్ భవన్) ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఎఐకెఎంఎస్ నేత పురుషోత్తమ శర్మ, ఎఐకెకెఎంఎస్ ప్రధాన కార్యదర్శి శంకర్ ఘోష్, ఐద్వా జాతీయ అధ్యక్షులు శ్రీమతి టీచర్ సౌహార్ద సందేశం ఇచ్చారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పాడారు. గంగిరెద్దుల కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు బతుకమ్మలను అలంకరించి తీసుకువచ్చారు.








కామెంట్‌లు (0)