శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మందమర్రిలో వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - మంత్రి వివేక్‌ వెంకటస్వామి

1 గంట క్రితం

మందమర్రిలో వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
 - మంత్రి వివేక్‌ వెంకటస్వామి
ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 09:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో​

మందమర్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం మందమర్రిలోని బీ1 క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి మండల తహశీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డిసిసి ప్రతినిధి రఘునాథ్‌తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆలస్యం చేయకుండా రెండు రోజులలోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు సకాలంలో అందించాలని సూచించారు. మందమర్రి ప్రాంతం ఏజెన్సీ స్వభావం కలిగి ఉన్నందున సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థ ‌సిఎండితో చర్చించి సింగరేణికి చెందిన భూమిని సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ భూమిలో సుమారు వేయ్యి ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒకే ప్రాంగణంలో విద్య, వసతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా ఈ పాఠశాలను నిర్మించడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. మందమర్రిలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అనువైన స్థలాన్ని పరిశీలించామని, వచ్చే ఏడాది మార్చి లోపు మంజూరు పొందేలా ప్రయత్నించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థ సహకారంతో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మందమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకం క్రింద మందమర్రిలో త్రాగునీటి పైప్‌లైన్ పనులు, క్యాతనపల్లిలో రెండు నీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులు, చెన్నూర్‌‌లో మూడు నీటి ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్