ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ కె హైమావతితో కలిసి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందేవని, ప్రజా ప్రభుత్వం ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు సైతం పింఛన్లు అందిస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లోనూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.








కామెంట్‌లు (0)