ప్రజాశక్తి - టంగుటూరు (ప్రకాశం) : పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు వేలం కేంద్రం (24)ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను మంత్రి పరిశీలించి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. కిలో పొగాకు ధర రూ. 200 కన్నా తగ్గకుండా కొనాలని కొనుగోలుదారులకు మంత్రి సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పొగాకు బోర్డు, రైతులు వ్యాపారులు, మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కిలో పొగాకు ధర 200 తగ్గకుండా కొనేలా, ఎక్కడా నోబిడ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు పొగాకు బోర్డు చర్యలు చేపట్టాలి. బోర్డు సెలక్షన్ గ్రేడ్ తీసుకోవాలి. వ్యాపారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తున్నాం. వ్యాపారులంతా అన్ని ప్లాట్ఫామ్స్ లో వేలంలో పాల్గొని రైతులకి సహకరించాలి. ఈ వేలం కేంద్రంలో గమనించిన అంశాలు, రైతుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తా. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సీజన్లో ఏ ఒక్క పొగాకు రైతును నష్టపోనివ్వమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
పొగాకు రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 01, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)