బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనూతన శకంలో నూతన ప్రయాణం...

1 గంట క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రపంచలో అత్యంత *శక్తి వంతమైన పార్టీ నిర్మాణమే లక్ష్యం

  • పార్టీలో అన్ని రకాల వైరస్‌‌లను నిర్మూలించాల్సిందే

  • 105వ వ్యవస్థాపక వార్షికోత్సవంలో జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌ : చైనా కమ్యూనిస్టు పార్టీ తాను సాధించిన పురోగతిని కాపాడుకుంటూనే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 105వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. చైనా నూతన శకంలో అడుగుపెట్టిందని, ఈ నూతన ప్రయాణంలో పార్టీ కర్తవ్యాలను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. ఈ 105 ఏళ్ల చరిత్రను "అత్యంత అద్భుతమైన ఇతిహాసం"గా అభివర్ణించారు. అలాగే చైనాను సకాలంలో ఆధునిక సామ్యవాద దేశంగా నిర్మించేందుకు పార్టీ ముందుకు సాగాలని కోరారు. చారిత్రాత్మక విజయాలు సాధించడానికి పార్టీ ప్రజలపైనే పూర్తిగా ఆధారపడాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తూనే మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా నడచుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కార్యకర్తలకు జిన్‌పింగ్‌ సూచించారు. ‘వ్యూహాత్మక అవకాశాలు, ప్రమాదాలు, సవాళ్లు ఏకకాలంలో కొనసాగుతున్న దశలో మన అభివృద్ధి ఉంది. దేశీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడానికి పార్టీ తన ప్రయత్నాలను మరింత మెరుగ్గా సమన్వయం చేసుకోవాలి’ అని అన్నారు. అలాగే "ప్రస్తుతం చైనా అభివృద్ధి, వ్యూహాత్మక అవకాశాలతో పాటు ప్రమాదాలు, సవాళ్లు కూడా నెలకొని ఉన్న దశలో ఉంది. అనిశ్చిత, అనూహ్య అంశాలు కూడా పెరుగుతున్నాయి. బలమైన గాలులు, ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, చివరికి భయంకరమైన తుఫానుల వంటి పెద్ద పరీక్షలను తట్టుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి," అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా పార్టీ పురోగతిని, పవిత్రతను ముందుకు తీసుకొని పోవాలంటే హానికరమైన వాటితో పాటు ఆరోగ్యకరమైన పార్టీని క్షీణింపజేసే అన్ని రకాల వైరస్‌లను నిర్మూలించాలని తేల్పి చెప్పారు. తైవాన్‌ సమస్య పరిష్కారం కోసం పార్టీ వ్యూహాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. ‘‘మారిపోతున్న మేఘాలకు బెదరక, గాలివానలను సైతం ఎదుర్కొని ముందుకు సాగేందుకు యావత్ పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతానికి, ప్రాథమిక మార్గానికి, ప్రాథమిక విధానానికి కట్టుబడి ఉండాలి’’ అని జిన్‌‌పింగ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

50తో ప్రారంభమై పది కోట్లకు

చేరిన సభ్యుల సంఖ్య..

1921లో కేవలం 50 మందితో స్థాపించిన చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య పది కోట్లకు చేరుకుంది. చైనా జనాభాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల సంఖ్య 7.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని ‘అతి పెద్ద రాజకీయ పార్టీ’ స్థాయి నుంచి ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీ’గా రూపాంతరం చెందడమే ప్రస్తుతం దాని ఉద్దేశమని అధికార సిన్హువా వార్తా సంస్థ తన తాజా సంపాదకీయంలో తెలిపింది. 2012లో అధికారంలోకి వచ్చిన జిన్‌పింగ్‌ దేశంలో పార్టీని అజేయ శక్తిగా మలిచారు. పార్టీ శ్రేణులలో క్రమశిక్షణను పెంచారు. ప్రపంచ వేదికపై చైనా ప్రభావాన్ని ఇనుమడింపజేశారు. అవినీతిని సమూలంగా రూపుమాపేందుకు చర్యలు చేపట్టారు. లక్షలాది మంది అధికారులపై విచారణలు జరిపించి అగ్రశ్రేణి జనరల్స్‌ సహా అవినీతిపరులుగా తేలిన వందలాది మందిని తొలగించారు. దేశంలో అన్ని స్థాయిలలోనూ అవినీతిని దాదాపుగా నిర్మూలించిన తర్వాత సీనియర్‌ అధికారుల కోసం అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఏప్రిల్‌లో పది వారాల రాజకీయ శిక్షణ కోర్సును ప్రారంభించారు. పార్టీ పట్ల విశ్వాసంతో ఉండాలని, దాని ఆశయాలకు విధేయులై ఉండాలని వారికి సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్