- రాజస్థాన్ గ్రామంలో పాఠశాల తనిఖీకి వెళ్లిన విద్యార్థులు
- బిజెపి ప్రభుత్వంలో పశువుల కొట్టంలో పాఠశాల?
- దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి : అభిజిత్ దీప్కే
జైపూర్ : దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం నాడు బిజెపి పాలిత రాష్ట్రం రాజస్తాన్‌లోని రాంపురా-కన్వర్‌పురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించేందుకు సిజెపి సహయ కన్వీనర్ అశుతోష్ రాంకా నేతృత్వంలోని బృందం యత్నించింది. ఆ బృందం గ్రామానికి చేరుకోగానే అక్కడి బిజెపి కార్యకర్తలు వారిపై దాడి చేశారు. స్కూల్‌ని పరిశీలించేందుకు , ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు వీల్లేదని అడ్డుకున్నారు. వారిని గ్రామం నుంచి తరిమికొట్టడంతో పాటు వాహ నాలను ధ్వంసం చేశారు, మహిళపై చేయిచే సుకు న్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
పశువుల కొట్టంలో పాఠశాల : అశుతోష్ రాంకా
ఈ గ్రామంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, దీంతో ప్రమాదకరమని మూసేశారని అశుతోష్ రాంకా తెలిపారు. అయితే, ప్రస్తుతం విద్యార్థులకు తరగతులు పాఠశాల సమీపంలోని పశువుల కొట్టంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత సంవత్సరం కూడా మేం ఈ పాఠశాలను తనిఖీ చేశాం... అప్పుడు కూడా ఇది గేదెల కొట్టంలోనే నడుస్తోంది’’ అని రాంకా గుర్తుచేశారు. ఈ దాడిలో ఒక కార్యకర్త చేయి విరిగిందని రాంకా తెలిపారు. దాడి చేసిన వారు అధికార బిజెపి కార్యకర్తలేనన్నారు. ‘‘మా పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. ఆ ప్రాంతంలో రాళ్ల దాడి జరుగుతుందని పోలీసులకు తెలిసినా జోక్యం చేసుకోలేదు’’ అని ఆయన తెలిపారు.
కారకులను తక్షణం అరెస్టు చేయాలి : అభిజిత్ దీప్కే
దాడి చేసిన బిజెపి గూండాలను 48 గంటల్లో అరెస్టు చేయకపోతే జైపూర్‌కు వచ్చి ఆందోళన చేపడతానని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. పాఠశాల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు పాఠశాలల సమస్యలపై సిజెపి ఆందోళనలకు బిజెపి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
దాడులు చేయడం సరికాదు : ఎస్‌ఎఫ్‌ఐ
జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేం దుకు వెళ్లిన సిజెపి అధికార ప్రతినిధి ఆశుతోష్ రాంకా, కార్యకర్తలపై జరిగిన దాడిని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది.
అశుతోష్, సిజెపి బృందంపై దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేయడం ఆందోళనకరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)