మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులపై పెల్లెట్ గ‌న్స్ వినియోగంపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ న‌మోదు

21 ఆగస్టు, 2026

Rahul Gandhi dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోలీసు స్టేష‌న్ ఎదుట‌ రాహుల్‌ గాంధీ ధ‌ర్నాతో దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సిజెపి) గత నెలలో చేపట్టిన పార్ల‌మెంట్ మార్చ్‌లో పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ ‌చేసింది. శుక్రవారం నాడు బాధిత కుటుంబంతో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. పెల్లెట్ గాయాలైన 19 ఏళ్ల బాధిత వ్య‌క్తి సాహిల్ లోచ‌వ్‌తో క‌లిసి రాహుల్ ముందుగా మందిర్ మార్గ్ పోలీసు స్టేష‌న్ వెళ్లారు. అక్క‌డ ఫిర్యాదు స్వీక‌రించేందుకు నిరాక‌రించ‌డంతో పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేందుకు నిరాక‌రించ‌డంతో రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా అక్కడే బైఠాయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడకంపై సమాధానం చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. దీంతో పోలీసులు దిగొచ్చి ఎఫ్ఐఆర్ న‌మోదుకు అంగీక‌రించారు. పెల్లెట్ గ‌న్‌ బాధితుడు సాహిల్ నుండి సాక్ష్యాలుగా ఆయ‌న‌ నుంచి మెడిక‌ల్ రిపోర్టులు, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత నెల20న శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో దాడి జరిగిందని, ఇందులో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు. పెల్లెట్ గ‌న్స్ వాడ‌కం ప‌ట్ల హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, ప్ర‌ధాని మోడీ కానీ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్నారు. ‘‘సాహిల్ శరీరంలో 200కు పైగా పెల్లెట్లు (చిన్న లోహపు గుళికలు) ఉన్నాయని, అందులో ఆయన కంటిలో మూడు పెల్లెట్లు ఉన్నాయని ఎయిమ్స్ నివేదిక పేర్కొంది. ఆయన తన కంటి చూపును కోల్పోయాడు. ఒక కంటితో ఆయ‌న‌కి ఏమీ కనిపించడం లేదు. గుండె దగ్గర కూడా పెల్లెట్లు ఉన్నాయి. వాటిని తొలగించడం సాధ్యం కాదు’’ అని అన్నారు. ‘‘దేశంలోని పిల్లలపై పెల్లెట్ గన్‌లను ప్రయోగించాలని అమిత్ షా ఆదేశించారు. తాము పెల్లెట్ గన్‌తో కాల్పులు జరపలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కానీ పెల్లెట్లు తగిలాయంటే ఎవరో ఒకరు కచ్చితంగా కాల్పులు జరిపి ఉంటారు కదా. కాబట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మేము డిమాండ్ చేశాం. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని పైస్థాయి నుండి ఆదేశాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు మాకు చెప్పారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకు మేము ఇక్కడి నుండి కదలం. ఈ కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం’ అని అన్నారు.

పోలీసులు కాల్చకపోతే పెల్లెట్లు ఎక్కడ నుండి వచ్చాయి.

బాధితుడు సాహిల్ లోచన్ తల్లి మాట్లాడుతూ ‘‘గత వారం మేము కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ ఏమీ జరగదని మాకు చెప్పారు. మీరు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమన్నారు. మేము అక్కడికి వెళ్లిన్నప్పుడు, అక్కడి నుండి కూడా మరో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమని చెప్పారు. ఎక్కడా మా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. పెల్లెట్ గన్ కాల్చలేదని పోలీసులు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే, నా కొడుకు శరీరంలో ఉన్న పెల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయి?’’ అని ఆమె ప్రశ్నించారు. బాధితుడు సాహిల్ లోచ‌వ్ మాట్లాడుతూ ‘‘జూలై 20న కన్నాట్ ప్లేస్ దగ్గర నాపై పెల్లెట్ గన్‌తో దాడి జరిగింది. ఎయిమ్స్‌లో నాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా, ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. గత వారం, నేను 7 పేజీల ఫిర్యాదును రాసి నా న్యాయవాదికి ఇచ్చాను. కానీ ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు’’ అని అన్నారు. ఈ ఆందోళ‌న‌లో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ప్రియాంక గాంధీ, జైరాం ర‌మేష్‌, కుమారి సెల్జా త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్