స్వీడన్‌పై ఫ్రాన్స్ గెలుపు
ప్రి క్వార్టర్స్ మెక్సికో కూడా...
ఫిఫా ప్రపంచకప్-2026
న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్-2026లో ఫ్రాన్స్ జట్టు ప్రి క్వార్టర్స్‌కు చేరింది. మెట్‌లైఫ్ స్టేడియంలో బుధవారం జరిగిన కీలక పోరులో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపే మరో రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. ఈ గెలుపుతో ఫ్రాన్స్ జట్టు ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్‌కు చేరింది. స్వీడన్ ఈ మ్యాచ్ కోసం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. తొలి అర్ధభాగమంతా బలమైన డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేస్తూ ఫ్రాన్స్ అటాకర్లను కట్టడి చేసింది. మొదటి 30 నిమిషాల పాటు స్వీడన్ అనుకున్న వ్యూహం ఫలించింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు గోల్ కోసం చేసిన లాంగ్-రేంజ్ ప్రయత్నాలను వారు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అయితే, మ్యాచ్ గడుస్తున్న కొద్దీ ఫ్రాన్స్ తన ఆట వేగాన్ని పెంచింది. 45వ నిమిషంలో ఫ్రాన్స్ నిరీక్షణ ఫలించింది. ఉస్మానే డెంబెలే, మైఖేల్ ఒలిసేలు చాకచక్యంగా ఆడిన షార్ట్ కార్నర్ వ్యూహం స్వీడన్‌ను దెబ్బతీసింది. ఎడమ వైపు నుంచి బంతిని అందుకున్న కిలియన్ ఎంబాపె, మెరుపు వేగంతో స్వీడన్ స్ట్రైకర్ విక్టర్ గ్యోకెరెస్‌ను కింద పడేశాడు. ఆ వెంటనే కుడికాలి క్లినికల్ షాట్‌తో బంతిని గోల్ కీపర్ జాకబ్ విడెల్ జెటర్‌స్ట్రోమ్‌కు అందకుండా నెట్ బాట పట్టించాడు. దీంతో ఫ్రాన్స్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ మరింత దూకుడుగా ఆడింది. 53వ నిమిషంలో మైఖేల్ ఒలిసే స్వీడన్ డిఫెన్స్‌ను దాటుకొని త్రో బాల్ను స్వీడన్ కెప్టెన్ విక్టర్ లిండెలాఫ్ కాళ్ల మధ్య నుంచి వెళ్లిన ఆ బంతిని బ్రాడ్లీ బార్కోలా నియంత్రణలోకి తీసుకుని, ఏమాత్రం తడబడకుండా స్వీడన్ గోల్ పోస్ట్ పైభాగానికి కొట్టాడు. దీంతో ఫ్రాన్స్ 2-0తో ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. 74వ నిమిషంలో ఒలిసే మరోసారి స్వీడన్ డిఫెన్స్‌ను చేధిస్తూ ఎంబాపెకు అద్భుతమైన పాస్ ఇచ్చాడు. బంతితో దూసుకెళ్లిన ఫ్రెంచ్ కెప్టెన్ బంతిని కర్ల్ చేస్తూ ఫార్ కార్నర్‌లోకి పంపాడు. స్కోరు 3-0గా మారడంతో స్టేడియం మార్మోగిపోయింది. స్వీడన్ జట్టు గోల్ కీపర్ జాకబ్ విడెల్ జెటర్‌స్ట్రోమ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఎంబాపె, అడ్రియన్ రాబియట్‌లు కొట్టిన ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాడు. ఈ పరాజయంతో ప్రపంచకప్‌లో స్వీడన్ ప్రస్థానం ముగియగా... ఫ్రాన్స్ ప్రి క్వార్టర్స్‌కు చేరింది. జులై 4న హై-వోల్టేజ్ రౌండ్ ఆఫ్ 16 పోరులో ఫ్రాన్స్ జట్టు పరాగ్వేతో తలపడనుంది.
ఎంబాపె రికార్డులు
ఈ మ్యాచ్ ద్వారా __ఎంబాపె అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పలు సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ (10 గోల్స్) చేసిన ఆటగాడిగా ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో బ్రెజిల్ దిగ్గజాలు లియోనిడాస్, రొనాల్డో (8 గోల్స్)లను వెనక్కి నెట్టాడు. ఎంబాపె ప్రపంచకప్ కెరీర్ మొత్తం గోల్స్ సంఖ్య 18కి చేరింది. తద్వారా ఆల్-టైమ్ అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లియోనెల్ మెస్సి(20) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఎంబాపె గోల్స్ సంఖ్య 6కు చేరింది. ప్రస్తుతానికి గోల్డెన్ బూట్ రేసులో అతను మెస్సితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
మెక్సికో 40 ఏళ్ల తర్వాత..
మెక్సికో సిటీ ఫిఫా వరల్డ్‌కప్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో నాకౌట్‌లోనూ సత్తా చాటింది. మెక్సికో సిటీలో బుధవారం జరిగిన రౌండ్-32(నాకౌట్)లో మెక్సికో జట్టు 2-0తో ఈక్వెడార్‌ను ఓడించింది. దీంతో మెక్సికో ఫిఫా ఫుట్‌బాల్ చరిత్రలో దాదాపు 40 ఏళ్ల తర్వాత మరోసారి నాకౌట్‌లో విజయాన్ని నమోదు చేసుకొని ప్రి క్వార్టర్ ఫైనల్ కు చేరింది. తొలి అర్ధభాగం 22వ నిమిషంలో జులియన్ క్వినోనిస్ , ఆ తర్వాత 9 నిమిషాల వ్యవధితో జిమినేజ్ మరో గోల్ కొట్టారు. దీంతో తొలి అర్ధభాగంలోనే మెక్సికో 2-0 ఆధిక్యతలో నిలిచింది. దీంతో మెక్సిక్.. రౌండ్16లోకి ప్రవేశించింది. చివరిసారి 1986లో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రౌండ్16 నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత మళ్లీ మెక్సికో ఈసారి విజయాన్ని నమోదు చేసింది. అయితే వరుసగా ఏడు సార్లు మెక్సికో నాకౌట్ దశలో ఓటమి పాలైంది. ఇంగ్లండ్-డిఆర్ కాంగో మ్యాచ్ విజేతతో మెక్సికో సోమవారం తలపడనుంది.
ఫిఫా ప్రపంచకప్ రౌండ్-32లో నేడు...
3(శుక్ర): స్పెయిన్×ఆస్ర్టియా (తె.12.30గం.లకు)
పోర్చుగల్ × క్రొయేషియా (తె.4.30గం.లకు)_








కామెంట్‌లు (0)