- ప్రపంచకప్ గోల్స్‌లో చరిత్ర సృష్టిస్తున్న ఎంబాపే
న్యూయార్క్: ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్న కైలియన్ ఎంబాపే మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతని కంటే ముందున్నది ఒక్క లియోనెల్ మెస్సీ మాత్రమే. 2018 ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్‌తో తన ప్రస్థానాన్ని ఆరంభించిన ఎంబాపే, 2022లో ఫైనల్‌లో హ్యాట్రిక్‌తో సహా ఎనిమిది గోల్స్ చేసి గోల్డెన్ బూట్‌ను గెలుచుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్న అతడు, గ్రూప్ దశలో రెండు గోల్స్, రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌పై రెండు గోల్స్ సాధించి ఈ టోర్నీలో తన గోల్స్ సంఖ్యను ఆరుకు చేర్చుకున్నాడు.
దీంతో మూడు ప్రపంచకప్‌ల్లో కేవలం 18 మ్యాచ్‌లలోనే 18 గోల్స్ చేసిన ఎంబాపే, ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆరు ప్రపంచకప్‌ల్లో 29 మ్యాచ్‌లలో 19 గోల్స్ చేసిన లియోనెల్ మెస్సీ మాత్రమే ప్రస్తుతం అతని కంటే ముందున్నాడు. 2014లో జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ నెలకొల్పిన 16 గోల్స్ రికార్డును మెస్సీ అధిగమించడానికి దాదాపు పదేళ్లు పట్టగా, ఎంబాపే మాత్రం మూడో ప్రపంచకప్‌కే ఆ మార్క్‌ను దాటేయడం విశేషం. దీంతో ఈ టోర్నీలోనే మెస్సీ రికార్డును కూడా అతడు అధిగమిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
నాకౌట్ దశలోనూ ఎంబాపే కొత్త చరిత్ర సృష్టించాడు. స్వీడన్‌పై రెండు గోల్స్‌తో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అతని గోల్స్ సంఖ్య 10కు చేరింది. దీంతో ఎనిమిది గోల్స్ చేసిన బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును అధిగమించి, నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గోల్డెన్ బూట్ పోరులోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం మెస్సీ, ఎంబాపే చెరో ఆరు గోల్స్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా, నార్వే సూపర్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఐదు గోల్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.








కామెంట్‌లు (0)