ప్రజాశక్తి- బుట్టాయగూడెం : ఆశ్రమ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించొద్దని, హైస్కూల్స్ గానే కొనసాగించాలని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లంకపాకల, పులిరామన్నగూడెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా పాఠశాలలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. లంకపాకల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను మూడు నుంచి పదో తరగతి వరకు పాత పద్ధతిలోనే యథావిధిగా కొనసాగించాలని, రేషనలైజేషన్ పేరుతో కుదించవద్దని డిమాండ్ చేశారు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులను లోపలికి వెళ్లనివ్వకుండా గేటు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం పాత పద్ధతిలోనే లంకపాకల ఆశ్రమ పాఠశాలను, ఇతర పాఠశాలలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసే విధానాలు తీసుకురావడం సరికాదన్నారు. అంతర్వేదిగూడెం ఎంపిటిసి సభ్యులు కొవ్వాసు గోవిందరాజు మాట్లాడుతూ లంకపాకల పాఠశాలను మూడు నుంచి పదో తరగతి వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలివేరు ఉప సర్పంచ్ చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన నిరసన
పులిరామన్నగూడెం పాఠశాల గేటుకు గ్రామస్తులు నాలుగో రోజు తాళం వేసి నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. నిరసన చేస్తున్న పులిరామన్నగూడెం గ్రామస్తులతో ఐటిడిఎ పిఒ రాములు నాయక్ చర్చించారు. ఏజెన్సీలో పాఠశాలల స్థాయి తగ్గించకుండా పాత పద్ధతిలో నిర్వహించాలని ఉన్నత అధికారులను కోరామని తెలిపారు. పులిరామన్నగూడెం, రెడ్డి కోపల్లి పాఠశాలలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ కు నివేదిక పంపించామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే ఉత్తర్వులు ఇస్తామని గ్రామ కమిటీకి అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాతపూర్వకంగా వచ్చిన తర్వాత మాత్రమే ఆందోళన విరమిస్తామని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.









కామెంట్‌లు (0)