పాఠశాల విద్య కమిషనర్ అన్సారియా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జియుకెటి) త్రిబుల్ ఐటీ ప్రవేశాల్లో మోడల్ స్కూల్ విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. 164 స్కూల్స్‌ల్లోని విద్యార్ధులు 2026-27 విద్యాసంవత్సరానికి 387 సీట్లు సాధించారని శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరం 343 సీట్లు సాధించగా ప్రస్తుత విద్యాసంవత్సరం అదనంగా 44 సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఉంచిన విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. మోడల్ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన బోధన, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు,ఉపాధ్యాయుల నిరంతర కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు. విద్యార్థుల ఉన్నత విద్యా లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రిన్సిపాల్స్, టీజీటీ, పీజీటీ, విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.మోడల్ స్కూల్స్ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, మరింత మంది త్రిబుల్ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు.









కామెంట్‌లు (0)