mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులు ప్రదర్శించాలి

14 గంటల క్రితం

nara lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 08:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కస్తూరిబా హాస్టళ్లలో బాలికలకు పూర్తిస్థాయి బెడ్స్ ఏర్పాటు


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను పాఠశాలల వెలువల బోర్డులపై ప్రదర్శించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ ‌పాఠశాలల ఫీజులను పబ్లిక్‌ ‌డొమైన్‌‌లో కూడా పొందుపరచాలని ఆదేశించారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసరమైన నిబంధనలను తొలగించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. కడప మోడల్ లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల్లో కూడా కూడా బంక్ బెడ్స్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. తెలుగు అకాడమీ ముద్రించే టెక్స్ట్‌బుక్స్ ప్రజలందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా విక్రయించాలని ఆదేశించారు.


అనాథ పిల్లలకు తల్లికి వందనం

​రాష్ట్రంలోని అనాథ పిల్లలకు కూడా 'తల్లికి వందనం' పథకం డబ్బులు అందేలా పక్కా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం పిల్లల గార్డియన్ల వివరాలను కచ్చితంగా సేకరించాలని, ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్‌కు పంపి, అక్కడ నుండి పిల్లలకు అందేలా చూడాలని చెప్పారు. అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసి, వారి చదువు పూర్తయిన తర్వాత ఆ సొమ్మును స్వతంత్రంగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధానం ఆలోచన చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. అటువంటి నిర్ణయం తీసుకోవడం వలన తల్లిదండ్రులు లేని పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా, వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు వారి హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, మరియు పోలవరం తదితర జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పాఠశాల హాజరు 95 శాతానికి తగ్గకుండా పక్కా చర్యలు తీసుకోవాలని, అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధికశాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురాగా ఎట్టి పరిస్థితుల్లో మాతృభాష తెలుగును విస్మరించొద్దని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్ ఛార్జి) జె శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్