శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన పాఠశాలల్లో కరువైన కనీస వసతులు

13 గంటల క్రితం

గిరిజన పాఠశాలల్లో కరువైన కనీస వసతులు
- ప్రభుత్వం, మంత్రి లోకేష్ స్పందించాలి 
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వం, మంత్రి లోకేష్ స్పందించాలి

- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ డిమాండ్‌

ప్రజాశక్తి - కురుపాం : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ‌రాష్ర్ట ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్‌ బచావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలంలో నాయకులు పర్యటించారు. తొలుత కురుపాంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాల, గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ ఆశ్రమ పాఠశాల, తొలుకర్జ, ఇరిడి ప్రాథమిక పాఠశాలలను పరిశీలించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ... తాము సందర్శించిన పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు, మెరుగైన వసతి, భోజనం అందడం లేదని విమర్శించారు. గిరిజన బిడ్డలకు నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే పాలకుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు విద్యార్థుల గదుల పైకప్పుల నుంచి నీరు కారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు మంచాలు, మ్యాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, మరుగుదొడ్లలో నీటి కుళాయిలు కూడా లేవని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే దృష్టికి తీసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ మాట్లాడుతూ... ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్