రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి డివైఎఫ్ఐ హెచ్చరిక
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో పోస్టులే లేవని తక్షణమే పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ సవరించాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నాచౌక్ లో నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన డివైఎఫ్ఐ నాయకులను, నిరుద్యోగులను అలంకార్ సెంటర్ వద్ద పోలీసు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు అక్కడే రోడ్డు పై బైఠాయించారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సంఖ్య పెంచాలని కోరుతూ ఇప్పటికే వివిధ జిల్లాల అనేక రూపాల్లో ఆందోళన చేస్తుంటే కూటమి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను నయవంచన చేయడమేనన్నారు. అధికారంలోకి రాకముందు యువతకు అండగా ఉంటామని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని లోకేష్ యువగళం పాదయాత్రలో హమీ ఇచ్చారని ఇప్పుడు నిరుద్యోగులతో మాట్లాడే తిరికలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పై వేధింపులు, నిర్భందం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక హోం మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారని వారి మాటలు నమ్మి నిరుద్యోగులు కోచింగులు, స్టడీ హల్స్, లైబ్రరీలు చుట్టు తిరిగి పుస్తకాలు పట్టుకొని సంవత్సరాలుగా ప్రిపరేషన్ అవుతున్నారని, ఇప్పుడు పోస్టులు లేని నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. తమ బాధను వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా పోలీసు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువత పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తే ఢిల్లీలో ఎమీ జరిగిందో ఒక్క సారి చూడాలని సూచించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ కు సిద్ధం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలీస్ కానిస్టేబుల్ 1156, ఎస్సై 378 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. తక్షణమే నోటిఫికేషన్ ను సవరించి పోస్టుల సంఖ్య 11, 639 పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల ముసుగులో యువతను మభ్యపెడుతూ కార్పోరేట్లకు కోట్ల రూపాయలు విలువైన భూములను అప్పగించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి 35కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పై వేధింపులు అపాలని సూచించారు. చేతనైన ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సంఖ్య పెంచి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి అబ్దుల్లా, రాష్ట్ర నాయకులు వీరేష్, అంజనేయరాజు, గణేష్, శివ, సురేంద్ర బాబు, నర్సింహ, ప్రకాశ్ బాబు, గౌస్, బసవ, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)