- ఉద్యోగ విరమణ వయసు పెంచొద్దు
- ఎపి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఖాళీగా ఉన్న వైద్యుల నియామకం చేపట్టాలని ఎపి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. వైద్యుల కొరతను అధిగమించేందుకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం శాశ్వత పరిష్కారం కాదని తాము భావిస్తున్నామని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు ఈశ్వర్ శంకర్, బలగం దినకర్ సాయిశ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ వయసును పెంచడం వల్ల ప్రభుత్వ వైద్య సేవల్లో కొత్త నియామకాలు గణనీయంగా ఆలస్యమవుతాయని, వైద్య విద్య, పిజి శిక్షణ పూర్తిచేసిన వేలాది మంది యువ వైద్యులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు. అసిస్టెంట్ నియామకాలు ఆలస్యం వల్ల యువ వైద్యుల వృత్తి పురోగతి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల కొరతకు కారణం అర్హులైన వైద్యులు లేకపోవడం కాదని అన్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఆమోదిత పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం, క్రమబద్ధకంగా నియామకాలు లేకపోవడం, అవసరమైన మేరకు కొత్త పోస్టులు సృష్టించకపోవడమే ప్రధాన కారణాలు అని తెలిపారు. ఉద్యోగ విరమణను వాయిదా వేయడం కంటే ఈ వ్యవస్థాపక సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని సూచించారు. ఎపిఎంఎస్ఆర్ బి, ఇతర సంబంధిత నియామక సంస్థల ద్వారా మంజూరైన అన్ని పోస్టులనూ వెంటనే భర్తీ చేయాలని కోరారు. స్పెషలిస్టులు, అధ్యాపకులు, వైద్యాధికారుల నియామకాలు క్రమం తప్పకుండా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా కొత్త ఆమోదిత పోస్టులను సృష్టించాలని కోరారు. జిల్లా ఆస్పత్రులు, బోధానాస్పత్రుల్లో సేవలందించడానికి సిద్ధంగా ఉన్న యువ స్పెషలిస్టులను నియమించి ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యుల సేవలను అవసరమైన చోట కాంట్రాక్టు నియామకాలు, సలహాదారులుగా, మెంటర్షిప్ కార్యక్రమాలు, అకాడెమిక్ కన్సల్టెన్సీ వంటి మార్గాల ద్వారా కొనసాగించవచ్చునని సూచించారు.








కామెంట్‌లు (0)