- సిపిఎం రాష్ట్రకమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం-2026 జాబ్ క్యాలెండర్‌లో కేవలం 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాదిమంది నిరుద్యోగులకు తీవ్ర నిరాశను కలిగించిందని సిపిఎం రాష్ట్రకమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని, గిరిజన నిరుద్యోగులకు స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీసు శాఖలోనే 20వేల ఖాళీ పోస్టులున్నట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. కనీసం 10వేల పోస్టులైనా భర్తీ చేయాలని నిరుద్యోగులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం ప్రకటించిన దానికంటే 4రెట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మెగా డిఎస్సి ప్రకటిస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు గతేడాది కేవలం 16వేల పోస్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించారని వివరించారు. ఇంకా విద్యాశాఖలోనే మరో 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. స్కూళ్లు మూసేసివేయడం గానీ తగ్గించేసి ఉద్యోగాలకు కోత పెట్టారని పేర్కొన్నారు. గిరిజన నిరుద్యోగులకు స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నా రాష్ట్రప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని పేర్కొన్నారు. దానికి మూలమైన జివో 3ను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి కేవలం 10వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. నిరుద్యోగుల వయోపరిమితిని కూడా సడలించి ఎక్కువమందికి అవకాశం కల్పించాలని కోరారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)