• నిందితులకు రిమాండ్
• ప్రజాసంఘాల కొవ్వొతుల ర్యాలీ
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి/ అమరావతి బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రసాదీత్యా మాల్ వద్ద జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడిన జిఎస్‌ఎస్ వైద్య విద్యార్థిని ప్రియాంక(28) పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నెల మూడున స్నేహితునితో కలిసి మాల్ కు వెళ్లి తిరిగి స్కూటీపై వస్తుండగా.. మద్యం సేవించిన సూరావరపు ధన్వంత్, ఆండ్రూజోసఫ్ అడ్వర్డ్ కారులో వీరిని ఢీకొట్టారు. కింద పడిపోయిన ప్రియాంక తలపై నుంచి కారు పోనిచ్చారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదానికి కారణమైన సురావరపు ధన్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్‌లను ప్రకాష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. నిందితులకు 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఘటనకు సంబంధించిన సిసి కెమెరాల దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వాహన వివరాలు తదితర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన
ప్రియాంక మృతి నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత లోతుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రసాదిత్యా మాల్ ఎదురుగా నిరసన తెలిపారు. ప్రసాదిత్య మాల్ నుంచి రామాలయం సెంటర్ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్, సిఐటియు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తప్పు చేసిన వారిని ఉపేక్షించొద్దు : సిఎం, డిప్యూటి సిఎం
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విడివిడిగా ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన తీరును ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోలను కారుతో ఢీకొట్టి పరారయ్యారని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని సిఎం ఆదేశించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పవన్ ఆదేశించారు.








కామెంట్‌లు (0)