సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపిలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి

23 గంటల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 06:33 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి

  • టిడిపి, వైసిపిలు రాష్ట్రాన్ని పణంగా పెట్టి మోడీ కొమ్ముకాస్తున్నాయి.

  • ప్రజాస్వామ్యాన్ని వివస్త్రను చేస్తున్న కూటమి ప్రభుత్వం

  • మిట్టల్ ఉక్కు నిర్వాసితుల జీవితాలు ఛిన్నాభిన్నం

  • భూ హక్కులను హరించే సోలార్ ఒప్పందాలను రద్దు చేయాలి

  • విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోసం

  • విద్యార్థి, యువత పోరాటానికి మద్దతు

  • అడవులు, పర్యావరణం నాశనం చేస్తుంటే డిప్యూటీ సిఎం నోరెత్తరేం?

ప్రజాశక్తి - విజయవాడ: రాష్ట్రంలో ఉన్న అధికార టిడిపి కూటమి, ప్రతిపక్ష వైసిపి యంపీలు` పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం చెప్పిన దానికి గుడ్డిగా చేతులెత్తకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలపై చర్చ, సోమన్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, మిట్టల్‌కోసం ప్రభుత్వ అరాచకాలు, ఏజెన్సీలో అక్రమ మైనింగ్, రాయలసీమలో సోలార్ కంపెనీల దాష్టీకం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు తదితర సమస్యలను ప్రస్తావించారు.

విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ మీద దాష్టీకం చేసి నిర్బంధించడం తీవ్రమైన విషయమని, దీన్ని సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. ఆయన్ను అరెస్టు చేసినా ఉద్యమం ఆగదని, ఎసఎఫఐ, తదితర విద్యార్థి సంఘాలతోపాటు అభిజిత్ దీప్కే నిరాహరదీక్ష కొనసాగిస్తున్నారని, వారి దీక్షకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అరెస్టులకు నిరసనగా సోమవారం సాయంత్రం విజయవాడలో సభ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయని, దీనికి సిపిఎం తరుపున మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

రాష్ట్రంకోసం యంపీలు గళం విప్పాలి

పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ప్రస్తావన చేసి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యులపై ఉందని అన్నారు. కానీ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఎంపిలను ఉద్దేశించి కేంద్రం ఏ బిల్లు పెట్టినా మద్దతు ఇవ్వాలని చేసిన ప్రకటన, కేంద్రానికి అనుకూలంగా జగన్ వారి ఎంపిలకు ఇచ్చిన సూచనలు చూస్తే టిడిపి, వైసిపిలకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నట్లు  కనిసిస్తోందని తెలిపారు. చంద్రబాబునాయుడు కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ఎంపిలకు చెప్పారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముట్టాయని, వాటిని పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. పొగాకు, మొక్కజొన్న, మామిడి, రైతులు నష్టపోయారని, ఆక్వారంగం దెబ్బతిందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. పొగాకు సంక్షోభానికి డబుల్ ఇంజన్ సర్కార్ బాధ్యత వహించాలన్నారు. అమెరికా విధానాలతో రాష్ట్రం నష్టపోతుంటే దానిపై కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో చంద్రబాబు, జగన్, పవన్ ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా ఆత్మగౌరవం ఉన్న పార్లమెంటు సభ్యులు రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.

ఏజెన్సీలో కార్పొరేట్ నిలువు దోపిడికి చట్ట ఉల్లంఘనలు

ఏజెన్సీలో కార్పొరేట్ కంపెనీల అక్రమాలకు, మైనింగ్‌కు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లాలో ఆదివాసీ యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోందని, వేలమంది తరలివస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఎందుకంటూ 1/70 చట్టాన్ని ఎత్తేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తే దానిపై రాష్ట్రం నోరత్తెలేదని తెలిపారు. గతంలో బాక్సైట్ వ్యతిరేక పోరాటం తర్వాత వైసిపి, తెలుగుదేశం, కాంగ్రెస్ అందరూ వ్యతిరేకించారని, ఆ తర్వాత బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు. 2019లో బాక్సైట్ జిఓను విత్‌డ్రా కూడా చేసుకున్నారని అన్నారు. ఇప్పుడు మరలా కేంద్రం మైనింగ్ కు అనుమతులు ఇచ్చి తవ్వకాలు చేసే పని ప్రైవేటు కంపెనీకి ఇచ్చారని, దీన్ని అడుగడుగునా గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని, తవ్వకాలను ఆదివాసీలు సహించబోరని తేల్చిచెప్పారని అన్నారు. దీనిపై కలెక్టర్లు, పోలీసులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పరిపాలన ఉందా లేదా అని ప్రశ్నించారు. ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదో షెడ్యూలు ప్రకారం గిరిజన ప్రాంతాలకు గవర్నర్ కస్టోడియన్‌గా ఉంటారని, అక్కడ పెసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని తెలిపారు. కానీ కార్పొరేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా దోపిడీకి దిగాయని, అడవులను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అడవులు లేకపోతే కరువు కాటకాలు వస్తాయని, నదులు ఎండిపోతాయని, ఇప్పటికే ఎల్ నినోతో పోరాడుతున్నామని ఆఖరికి ఆక్సిజన్ కూడా దొరకదని తెలిపారు. ఆదివాసీల హక్కులు అనేది రాష్ట్ర ప్రజల ఉమ్మడి సమస్యగా ఉందని తెలిపారు. అడవులను కాపాడలేకపోతే రాష్ట్రం దెబ్బతినిపోతుందని, మైనింగ్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అక్కడ అనుమతి ఇవ్వడానికి వీల్లేదని తెలిపారు. మంత్రి సంధ్యారాణి 1/70 చట్టాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అలా అయితే సుప్రీం కోర్టులో కౌంటర్ పిటీషన్ వేయాలని డిమాండు చేశారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ దీనిపై ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అటవీశాఖ మంత్రిగా అడవుల్లో కార్పొరేట్ యాక్టివిటీని అరికట్టాలని, లేనిపక్షంలో ఆదివాసీల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జివో 3ని మరల తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మిట్టల్ ఉక్కు నిర్వాసితుల్ని ఆదుకోవాలి

అనకాపల్లి జిల్లాల్లో విశాఖ ఉక్కును నాశనం చేసేందుకు మిట్టల్‌ను తెచ్చిపెట్టారని అన్నారు. దీనికోసం ప్రతి గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేశారని, వ్యవసాయం, ఉపాధి లేదని, శ్మశానవాటిక కూడా లేకుండా చేశారని చందనాడ గ్రామాన్ని నిర్వాసిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించానని తెలిపారు. పనికోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారికి పునరావసం పేరుతో నక్కపల్లి వద్ద భూమి కేటాయించారని, దీనికోసం గ్రామాల్లో ఇళ్లను కూల్చేశారని తెలిపారు. మిట్టల్ కంపెనీ దోపిడీని అడ్డుకుంటున్న రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పిడి యాక్టు ప్రయోగించి ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. కూలగొట్టే ముందు ప్రభుత్వ ప్రతినిధులు,  గ్రామస్తులకు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. ఇళ్లు కట్టిస్తామని, సగం ధరకే ఇనుము, సిమెంట్, ఇసుక ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని, కాలనీల్లో కనీస సదుపాయాలు కూడా లేకుండా చేశారని విమర్శించారు. ఇల్లు కట్టుకునేందుకు తొమ్మిది లక్షలు ఇచ్చారని, వాస్తవంగా ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ.25 లక్షలు ఖర్చవుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఉపాధి, ఇల్లు, డ్రైనేజీ, మంచినీరు ఏదడిగినా తమకు తెలియదని చెబుతున్నారని అన్నారు. పునరావాసం కల్పించేందుకు అవసరమైన వివరాలు చెప్పేందుకు కనీసం లైజాన్ అధికారి కూడా లేరని, దీనికి నక్కపల్లి ఆరఅండఆర్ కాలనీ సజీవ సాక్ష్యంగా ఉందని అన్నారు. అక్కడకు ముఖ్యమంత్రి వెళితే సమస్యలు తెలుస్తాయని, కలెక్టర్ కూడా చూసి వెళ్లిపోవడం తప్ప చేస్తుందేమీ లేదని అన్నారు. ఆయా గ్రామాల్లో ఉపాధి కూడా కోల్పోయిన వారికి కనీసం రేషన్ కూడా లేదని, ఊరు వల్లకాడుగా మారిందని  పేర్కొన్నారు. మిట్టల్, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును, నిర్వాసితులను బలిపెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. హోమ్‌శాఖ మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. మిట్టల్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారిలో 18 ఏళ్ళు నిండిన, పెళ్లయిన మహిళలకు చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు.

సోలార్ ఒప్పందాలతో భూమిపై రైతు హక్కుకు ఎసరు

రాయలసీమలో సోలార్ ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకుని రైతులను మోసం చేశారని, భూమికి భద్రత పోయిందని, ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ లేదని అన్నారు.  రైతుల భూమిని తాకట్టుపెట్టి కంపెనీలు వందల కోట్ల రుణాలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వరని, పరిహారం చెల్లించరని, బ్యాంకర్లు లోన్లు ఇవ్వరని, కానీ భూమిని కౌలుకు తీసుకున్న పారిశ్రామికవేత్తలకు లోను తీసుకునే అవకాశం ఇస్తున్నారని విమర్శించారు. కంపెనీలు లోను తీర్చకపోతే రైతుకు కష్టం వస్తే ముంబయి కోర్టుకు వెళ్లాలని, వారికి ప్రభుత్వం మద్దతు ఉండదని పేర్కొన్నారు. దీన్ని రైతులు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం థర్డ్ పార్టీగా చేరి రైతులకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని, ఐదేళ్లకు మాత్రమే లీజు అగ్రిమెంటు ఇవ్వాలని, ఎకరాకు కౌలు పరిహారం రూ.50 వేలుకు పెంచాలని శ్రీనివాసరావు కోరారు.  రైతుకు భూమిపై హక్కును తీసేసే సోలార్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దీనిపై చట్టం తీసుకొచ్చి రైతులకు భద్రత కల్పించాలని డిమాండు చేశారు.

ప్రజాస్వామ్య హక్కులకు ప్రమాదం

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడతామని అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వివస్తృను చేస్తున్నదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో తెలుగుదేశం నాయకులకు ముఖ్య అనుచరులుగా ఉన్న వ్యక్తి  మహిళలను వివస్త్రను చేశారని, ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నారని అన్నారు. నిందితుడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సరిపోతుంది. కాదని, ముఖ్యమంత్రి కూడా ఉపేక్షించబోమని చెబితే ఉపయోగం లేదని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని విమర్శించే యూట్యూబర్‌లను వెంటపడి వేధిస్తున్న ప్రభుత్వం మహిళను వివస్త్రను చేస్తే చర్యలు తీసుకోదా అని ప్రశ్నించారు. ఏలూరు ఎంపి డ్రగ్స్ తీసుకున్నా అతనిపై చర్యలు లేవని అన్నారు. ప్రజా ప్రతినిధులు దాడులు చేస్తున్నా, డ్రగ్స్ తీసుకుంటున్నా తెలుగుదేశం నాయకత్వం ఉదారంగా ఉంటోందని తెలిపారు. అదే సమయంలో సమస్యలపై ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇలాంటి కక్షపూరిత పాలన ఎక్కువకాలం సాగదని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్