- పాల్గొన్న పలువురు నగర ప్రముఖులు
ప్రజాశక్తి - విజయవాడ: విజయవాడను మృత నగరం(డెడ్ సిటీ)గా మార్చవద్దని, విజయవాడ, అమరావతిలను జంట నగరాలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర అభివృద్ధి పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వీడాలని, సి.ఆర్.డి.ఏ నిధులలో సగభాగం విజయవాడకు కేటాయించాలని కోరారు. విజయవాడ నగరంలో వసూలు చేసే అన్ని రకాల పన్నులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరపాలక సంస్థకు కనీసం 10%. వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగర అభివృద్ధికి తక్షణం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, యువతకు ఉపాధి చూపే పర్రిశమలు, సంస్థలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సి.పి.ఎం.ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.
పలు సమస్యలు :
- 15లక్షల 56వేల జనాభాతో రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరంగా, జనసాంద్రత అధికంగా ఉన్న విజయవాడ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఇటీవల కాలంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నది.
- వ్యాపార, వాణిజ్య, రవాణా, రైల్వే, రాజకీయ, ఉద్యమ, సాంస్కృతిక, సాహిత్య కేంద్రంగా ఉన్న విజయవాడకు చారిత్రక వారసత్వం ఉన్నది.
ఎంతోమంది ప్రముఖులను అందించిన విజయవాడను ప్రస్తుతం మృత నగరం (డెడ్ సిటీ)గా మార్చటం బాధాకరం.
- అమరావతి అభివృద్ధి కోసం విజయవాడ నగర అభివృద్ధిని పణంగా పెట్టడం తగదు.
- మెగాసిటీ, గ్రేటర్ విజయవాడ, మావిగన్ నినాదాలు తప్ప.. నగర అభివృద్ధిని పాలకులు గాలికి వదిలేసారు.
- క్యాపిటల్ రీజియన్లో విజయవాడ భాగమైనా, సి.ఆర్.డి.ఏ. విజయవాడ అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించలేదు, నిధులు కేటాయించడం లేదు.
- అభివృద్ధిలో వెనకంజలో ఉన్నా... పన్నుల భారాలలో నగరపాలక సంస్థ, ప్రభుత్వం ముందుంటున్నవి.
- విజయవాడ నగరపాలక సంస్థకు నిధులు సాధించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు.
నిర్లక్ష్యానికి ఆనవాళ్లు :
విభజన చట్టంలో ఉన్నా మెట్రో (ప్రజా రవాణా) వ్యవస్థకు 12ఏళ్లుగా నిధులే కేటాయించ లేదు.
ఒక్క నూతన ప్రాజెక్టు, పరిశ్రమ, సంస్థ ఏర్పాటు లేదు.
విద్యాధికులైన యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలి వెళుతున్నారు.
నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న ఇంటి పన్నులతో సహా అన్నిరకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం సి.ఎఫ్.ఎం ఎస్. పేరుతో తనఖజానాకు మళ్ళించుకుంటున్నది. నిధుల విడుదల వారి దయాదాక్షిణ్యలపై ఆధారపడి ఉంటున్నది.
రూ.350కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు పడితే, వారు సమ్మె చేశారు. అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. టెండర్లు వేసే నాధుడు లేడు.
నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో ఉంది. ఆస్తులు తాకట్టులో ఉన్నాయి.
ఫైనాన్స్కమిషన్ గ్రాంట్లు, వినోదపు పన్ను, వృత్తిపన్ను, మోటార్ వాహనాల పన్ను, తలసరి గ్రాంట్లు, స్టాంప్ డ్యూటీ, ప్రకటనలు పన్ను ఇలా దాదాపు రూ1000 కోట్లకు పైగా రాష్ట్రం నగర పాలకసంస్థకు బకాయి పడింది.








కామెంట్లు (0)