శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు గల్లంతు

16 ఆగస్టు, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:55 అపరాహ్నం | 6 నిమిషాల చదవడం

• పార్టీ నేత సిహెచ్‌ బాబూరావుకు నోటీసులు

• ఓటర్ల జాబితాలో తప్పులకు కమిషన్‌దే బాధ్యత

• సోలార్ భూముల రక్షణకు చట్టం తేవాలి

• తలొంపులు తెచ్చేలా ప్రధాని ప్రసంగం

• మేధో నక్సల్స్ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎస్‌ఐఆర్‌ పేరుతో రాష్ట్రంలో కూడా ఓటర్ల జాబితా కుదింపు జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్లు తగ్గించటానికి, పౌరులకు ఓట్లు లేకుండా చేయటానికి ఒక కుట్రపూరితంగా ఎస్‌ఐఆర్‌‌ను తీసుకొచ్చి దేశంపై రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌.. ఓట్లు తొలగించే ప్రక్రియ అని తాము తొలి నుంచి చెబుతున్నామని, రాష్ట్రంలో అది నిరూపితమైందని అన్నారు. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి కూడా ఓట్లు తొలగించొద్దని, ఇబ్బందులు ఉంటే ఓటర్ల ఇంటికెళ్లి సరిచేసి పునరుద్ధరించాలని కోరుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 2002 జాబితాతో సరిపోవడం లేదని, 44 లక్షల మందిని తొలగించారని చెప్పారు. వీరిలో సుమారు 25 లక్షల మంది వలస వెళ్లారని, వీరంతా పేదవాళ్ళు అని తెలిపారు. వలస వెళ్లిన వారికి ఎక్కడా కూడా ఓటు ఇవ్వడం లేదన్నారు. వలస వెళ్లిన చోట ఓటు హక్కు కల్పించడం లేదని, సొంత ఊరులోనూ ఇక్కడ ఉండటం లేదని నిరాకరిస్తున్నారని అన్నారు. 25 లక్షల మంది శ్రామిక ప్రజల ఓటు హక్కును తొలగించడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు 2002 ప్రకారం ఎన్‌రోల్ అయిన 44 లక్షల మందికి ఇప్పుడు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ నోటీసు అందుకున్న వారిలో విజయవాడలో తమ పార్టీలో గుర్తింపు నాయకుడు చిగురుపాటి బాబూరావు కూడా ఉన్నారని వెల్లడించారు. 2002లో బాబూరావు తండ్రి పేరులో తేడా ఉందని, తమకు డాక్యుమెంట్లు తెచ్చి నిరూపించుకోవాలని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీలో ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎంతమంది పోయి డాక్యుమెంట్లు అప్పగించి రుజువు చేసుకోగలరని ప్రశ్నించారు. కొంతమందికి వయసు తేడా ఉందని, మరికొంత మందికి తాత ముత్తాతల వివరాలు సరిపోలేదని నోటీసులిచ్చారని పేర్కొన్నారు. ఆ నోటీసులను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. బుర్ర, బుద్ధి ఉన్నోళ్లు చేసే పనేనా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే రాచరికంలో ఉన్నామా? అని నిలదీశారు. వారి నిబంధనల ప్రకారం చదువుకున్న వాళ్ళు, వ్యాపారం, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు హక్కు పత్రాలు ఇచ్చి నిరూపించుకోగలరని, రాష్ట్రంలో 40 శాతం నిరక్ష్యరాసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరే అని చెప్పారు. కానీ ఓటు ఉన్నా ఇప్పుడు పౌరులు కాదంటున్నారని, మరి పౌరుడని ఎవరు నిర్ణయించాలని ప్రశ్నించారు. పౌరులందరికీ ఓటు హక్కు అన్నారని, ఇప్పుడు ఓటు హక్కు ఉన్నా పౌరులు కాదంటున్నారని తెలిపారు. ఇది తలతిక్క వ్యవహరం అని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటం తప్ప మరొకటి కాదని అన్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుందని అలాంటి వారికి ఎన్నికల కమిషన్‌గా ఉండే అర్హత లేదన్నారు. పౌరుల హక్కులను కాపాడి, ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించాల్సిన ఎన్నికల కమిషన్.. ఓట్లు తీసేసి, తగ్గించేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వం ఇచ్చే బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎన్నికల కమిషన్ పనికిమాలిన వ్యవస్థలా మారిపోయిందని విమర్శించారు.

రాష్ట్రంలో 44 లక్షల మందికి నోటీసులిచ్చి నిరూపించుకోవాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2002లో అధికారులే వచ్చి వివరాలు రాసుకున్నారని తెలిపారు. ఇప్పుడు వస్తున్న తప్పులకు బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ఒకరు ఓటర్ కాదని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే తప్ప, తాను ఓటరును అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరులది కాదన్నారు. కానీ ఇక్కడ సహజ న్యాయానికి విరుద్ధంగా జరుగుతోందన్నారు. దేశంలో 140 కోట్ల మందికి పరీక్ష పెట్టి తాము చెప్పిన వాళ్లే ఓటరు అని మోడీ నిరంకుశ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఇలా అయితే అధికార పార్టీకి తొత్తులుగా ఉండే వాళ్లకే ఓటు వస్తుందన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్‌ఐఆర్‌ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఓటర్ ఇంటికి వచ్చి ఎన్‌రోల్‌మెంట్ చేయాల్సిన బాధ్యతను విస్మరించి తమ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ తమ గుర్తింపు కోసం పని పోగొట్టుకోవాలా అని నిలదీశారు. ఎన్నికల కమిషన్‌ను నియమించాల్సింది సుప్రీంకోర్టు అని, మోడీ కాదన్నారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ మోడీ కనుసన్నలో నడుస్తుందన్నారు.

నిర్వాసితుల హక్కుల కోసం చట్టం చేయాలి

ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతున్న వారి హక్కులు కాపాడేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో సుమారు 4 వేల మంది నిర్వాసితులకు పరిహారం అందించలేదని చెప్పారు. పరిహారం ఇవ్వకుండానే 24వ తేదీన ఖాళీ చేసి వెళ్లాలని గొంతుపై కూర్చుంటున్నారని తెలిపారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే అని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు కూడా 21 శాతం మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్లు కాదన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇస్తేనే పూర్తి అని తెలిపారు. రాయలసీమలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో కంపెనీలు.. రైతుల దగ్గర అక్రమంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా లేదా అని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలు బ్రోకర్లను పెట్టుకుని అక్రమంగా లీజుకు రాయించుకుంటున్నాయని, ఈ భూములను బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకుంటున్నాయని తెలిపారు. ఈ తప్పుడు ఒప్పందాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై రైతులు కోర్టులో కేసు వేస్తే ముంబాయి వెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుందని, ఇది అర్థమైన రైతులు భూములు ఇవ్వడం లేదని చెప్పారు. కార్పొరేట్లు గ్రామాల్లో రైతులను మోసం చేసి బలవంతంగా అగ్రిమెంట్లు చేయించుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. కళ్లు, చెవులు మూసుకొని కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకు వారిని ఊర్లపైకి పంపారా? అని నిలదీశారు. ‘మీ భూమి మీ హక్కు’ అంటూ ప్రభుత్వం రైతుల భూములను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందన్నారు. రాయలసీమ సోలారు రైతులకు ప్రభుత్వం అండగా ఉండి భూములు కాపాడాలని, నిర్వాసితుల హక్కులను కాపాడుతూ 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మేధో నక్సల్స్‌ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం

​ప్రధాన మంత్రి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం జాతికి తలొంపులు తెచ్చేలా ఉందని వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. యువతరం గొంతును అణచివేసేందుకు మేధో నక్సల్స్ అనే ఒక కొత్త పేరు సృష్టించారని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరించేందుకు, నిరంకుశత్వాన్ని దేశంపై బలవంతంగా రుద్దడానికి, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి ఈ పదాన్ని జనం నెత్తిపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేరుతో ఎవరినైనా జైలుకు పంపే అవకాశం ఉందన్నారు. అత్యంత ప్రమాదకరమైన పద్ధతిలో మోడీ ప్రభుత్వం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో యువత, విద్యార్థులు పెద్దయెత్తున చేసిన పోరాటం దెబ్బకు తట్టుకోలేక మోడీ ప్రభుత్వం మెడలు వంచిందన్నారు. ఆ యువతరం గొంతు ఎలా అణగదొక్కాలి, వాళ్ళ హక్కులను ఎలా హరించాలనే ఆలోచనలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు కుట్రపూరితంగా ఎర్రకోట నుంచి ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మేధావులు, ప్రజాతంత్రవాదులు, అన్ని రాజకీయ పార్టీలూ దీన్ని ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలు

ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శ్రీనివాసరావు అన్నారు. 1995 తరువాతే ఎన్నికల్లో డబ్బులు పంపిణీ మొదలైందన్నారు. ఎన్నికలను వ్యాపారం చేసింది చంద్రబాబు అని విమర్శించారు. ఎన్‌‌టిఆర్ సామాన్య ప్రజలకు సీట్లు ఇస్తే చంద్రబాబు కార్పొరేట్లకు, డబ్బులు ఉన్నవారికి సీట్లు ఇచ్చారని తెలిపారు. డబ్బు రాజకీయాలకు బలవుతోంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులని చెప్పారు. ఓటుకు రూ.2 వేల చొప్పున 3.5 కోట్ల మందికి పంచేందుకు వేలకోట్ల నల్లడబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. నోట్ల రద్దుతో నల్లడబ్బు లేదన్నారని, ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందన్నారు. చంద్రబాబు.. అర్హులకు సీట్లు ఇవ్వాలని, డబ్బు ఉన్నోళ్లకు ఇవ్వొద్దని, ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయడం మానుకుంటే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలి తీసుకుంటూ చంద్రబాబు సుద్దులు చెప్పటం, ప్రజలపై నేరం వేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలపై తమ పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 12వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేయాలి

రెండేళ్ల నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఊకదంపుడు ఉపన్యాసాలే అని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలు ప్రస్తావించినా అవి పరిష్కారం కావడం లేదన్నారు. కాబట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. డీలిమిటేషన్ బిల్లు అడ్డుపెట్టి మహిళా చట్టాన్ని అమలు చేయకుండా ఎగరగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని టిడిపి, వైసిపి ఒప్పుకున్నాయని తెలిపారు. అందుకని డీలిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఐఆర్‌‌తో ప్రజాస్వామ్య హననం : వై వెంకటేశ్వరరావు

ఎస్‌ఐఆర్‌ పేరుతో జరుగుతోంది ప్రజాస్వామ్య హననం తప్ప మరొకటి కాదని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ ప్రారంభానికి ముందే కేంద్ర ఎన్నికల కమిషన్‌లో అనుకూలమైన వారిని నియమించిందన్నారు. ప్రభుత్వానికి, పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారినే ఎన్నికల కమిషన్‌లో ఉంచారని తెలిపారు. గతంలో ఎన్నికల కమిషన్‌ను ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడుతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో ఉన్నా చిన్న, చిన్న అక్షరాలు, గ్యాప్‌లకు కూడా వివరణ ఇచ్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నోటీసులు అందించారని తెలిపారు. వీటిని సుమోటోగా స్వీకరించి వారిని ఓటర్లుగా గుర్తించాలని కోరారు. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థుల కేసును ఇప్పుడే స్వీకరించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) చెప్పారని గుర్తుచేశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌లో నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు సిజెఐను ఆహ్వానించొద్దని ప్రజాస్వామ్య పద్ధతిలో వినతి ఇచ్చారని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్‌కు దీంతో సంబంధం లేకపోయినా ఆ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దని జారీ చేసిన ఆదేశాలపై వ్యతిరేకత వచ్చిందన్నారు. బెంగళూరు లా యూనివర్సిటీలో కూడా ఆందోళన జరుగుతుందన్నారు. దీనిపై దేశమంతా గగ్గోలు పెట్టిన తర్వాత మొత్తం ఉపసంహరించుకున్నారని తెలిపారు. బిసిఐ చీఫ్ బిజెపి ఎంపి అని వ్యవస్థను అదిరించి, బెదిరించి తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారిని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రయత్నాలను కచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్