శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకాశం బ్యారేజీకి జలకళ

14 గంటల క్రితం

Water art for Prakasam Barrage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ జలకళను సంతరించుకుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో తొలిసారిగా గురువారం రాత్రి 20 గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని వాగులు, వంకల నుంచి వరద నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.


జూన్‌ నుంచి ప్రారంభమైన ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను తొలిసారిగా ఎత్తారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో అధికారులు 20 గేట్లను అడుగు మేర పైకెత్తారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం బ్యారేజీకి 40,521 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఉదయం 9 గంటలకు ఈ ప్రవాహం 44,054 క్యూసెక్కులకు చేరింది. కాలువలకు నీటి విడుదలతో పాటు మిగులు జలాలను దిగువకు పంపిస్తున్నారు. ఉదయం 9 గంటల గణాంకాల ప్రకారం 36,250 క్యూసెక్కుల మిగులు జలాలు దిగువకు విడుదలవుతున్నాయి. కాలువలకు మొత్తం 7,804 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా ... మరోవైపు మున్నేరు ఆనకట్ట వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 6.1 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ నుంచి 9,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అదే పరిమాణంలో నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆనకట్టలో ప్రస్తుతం 0.10 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్