ఈ ఘటనలో బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలి
బాధిత కుటుంబానికి జగన్ పరామర్శ
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : క్రాంతికుమార్ మరణానికి కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మ్‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. అకారణంగా ఓ అమాయకుడిని పోలీసులు హింసించారని ఆరోపించారు. అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులనే రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని విమర్శించారు. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విజయవాడ ఫకీరుగూడెంకు చెందిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను గురువారం జగన్ పరామర్శించారు. ముందుగా క్రాంతికుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి వేదనను తెలుసుకొని భరోసా ఇచ్చారు. పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ... క్రాంతికుమార్ సాధారణ కారు డ్రైవర్ మాత్రమేనని, ఆయనపై ఎలాంటి కేసులూ లేవని, అలాంటి వ్యక్తిని పదేపదే పోలీస్ స్టేషన్‌కు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. మూడు నెలలుగా పోలీసులు తనను వేధిస్తున్నారని క్రాంతికుమార్ స్వయంగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మరణ వాంగ్మూలం ఆధారంగా ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నెల వ్యవధిలో విజయవాడలో రెండు దారుణ ఘటనలు జరిగాయని, ఒకటి సాయికృష్ణ లాకప్ డెత్ కాగా, మరొకటి క్రాంతికుమార్ ఆత్మహత్య అని చెప్పారు. సాయికృష్ణ కేసులో ఏకంగా సిసిటివి పుటేజీనే మాయం చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఐ నాగరాజును విజయవాడ నగర పోలీసు కమిషనర్, సిపిని డిజిపి... డిజిపిని చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. క్రాంతికుమార్ కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, న్యాయపోరాటంలో పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపి నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)