న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దీప్కే లెహ్రా దో తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా ఈ యాత్రను చేపట్ట కూడదంటూ అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరంగా మార్చ్‌కు ముందు పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటారని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.
నోటీసులు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చిన పోలీసులను అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. భుజంపై జాతీయ జెండాను ధరించి, సోఫాలో కూర్చొని ఉన్న ఆయన పోలీసులు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "మీరు సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొడుతున్నారు అది చట్టవిరుద్ధం" అని నోటీసులో రాసి ఉన్న అంశాలను బిగ్గరగా చదివి వినిపిస్తూ పోలీసులను నిలదీశారు. " దీన్ని అసలు నోటీసు అంటారా ? మీకు తోచినదంతా రాసుకొచ్చారా ?" అని ఆయన ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. తాను హింసను ప్రేరేపించినట్లు లేదా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఒక్క వీడియోనైనా చూపించగలరా ? అని పోలీసులకు సవాల్ విసిరారు. "మీరు నాకు సంబంధించి అలాంటి ఒక్క వీడియో కూడా చూపించలేరు" అని తేల్చి చెప్పారు.
జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ .. మరుసటి రోజు సిజెపి సభ్యులు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలు జంతర్ మంతర్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైలుకు పంపారు. సిజెపి నేతల అరెస్టును ఖండిస్తూ సిజెపి నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. సెంట్రల్ పార్క్‌ను శుక్ర, శనివారాల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది.







కామెంట్లు (0)