ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిస్లరీ నీటిలో బ్యాక్టీరియా - వారంలో రెండోసారి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చర్యలు

21 గంటల క్రితం

Bacteria in Bisleri water FSSAI takes action for the second time in a week
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 01:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జల్‌పాయిగురి ప్లాంట్‌ నమూనాల్లో కోలిఫామ్‌ గుర్తింపు.. బ్రోమేట్‌, పీఏహెచ్‌లు కూడా పరిమితికి మించి ఉన్నట్లు నిర్ధారణ


న్యూఢిల్లీ : ప్రముఖ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్‌ పై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) మరోసారి చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా టెలీపారా ప్లాంట్‌ నుంచి సేకరించిన తాగునీటి నమూనాల్లో కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు రెండు ప్రయోగశాలల పరీక్షల్లో నిర్ధారణ కావడంతో, ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌ చర్యలకు అనుమతినిచ్చింది. వారం వ్యవధిలోనే బిస్లరీపై ఈ తరహా చర్యలకు అనుమతి ఇవ్వడం రెండోసారి కావడం గమనార్హం.


జల్‌పాయిగురి ప్లాంట్‌ నుంచి సేకరించిన నీటి నమూనాలను ముందుగా ప్రాథమిక ప్రయోగశాలలో పరీక్షించారు. అక్కడ కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్థారణ కావడంతో సంస్థ విజ్ఞప్తి మేరకు మరో రిఫరల్‌ ల్యాబ్‌లోనూ పరీక్షలు నిర్వహించారు. రెండో పరీక్షలోనూ బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడటంతో నీటిని అసురక్షితమైనదిగా అధికారులు ప్రకటించారు. సాధారణంగా మురుగునీటి లీకేజీలు, దెబ్బతిన్న పైప్‌లైన్ల ద్వారా ఈ బ్యాక్టీరియా నీటిలోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Bacteria in Bisleri water FSSAI takes action for the second time in a week


ఇదే సమయంలో పరిశీలనలో ఉన్న నీటి నమూనాల్లో అనుమతించిన పరిమితికి మించి బ్రోమేట్‌, పాలీన్యూక్లియర్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు (పీఏహెచ్‌) ఉన్నట్లు కూడా ప్రయోగశాల పరీక్షల్లో వెల్లడైంది. ఈ ఫలితాలు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రెండు ప్రయోగశాలల నివేదికల్లోనూ ఉల్లంఘనలు నిర్ధారణ కావడంతో సంస్థపై చట్టపరమైన చర్యలకు మార్గం సుగమమైంది.

Bacteria in Bisleri water FSSAI takes action for the second time in a week


ఇంతకుముందు బిస్లరీ గోవా ప్లాంట్‌ నుంచి సేకరించిన నీటి నమూనా కూడా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఆగస్టు 12 న నాణ్యతా లోపాల కారణంగా సంస్థకు చెందిన ఒక బ్యాచ్‌ నీటి విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిషేధం విధించింది. తాజాగా జల్‌పాయిగురి ప్లాంట్‌ నమూనాల్లోనూ ప్రతికూల ఫలితాలు రావడంతో బిస్లరీ నీటి నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


మరోవైపు, తమ ప్యాకేజ్డ్‌ తాగు నీరు వినియోగానికి పూర్తిగా సురక్షితమని బిస్లరీ యాజమాన్యం పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆహార, పానీయాల తయారీ సంస్థలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తనిఖీలు, చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో బిస్లరీపై తాజా చర్యలు చోటుచేసుకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్