హోస్టెస్ సేవలు.. వైఫై.. ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు.. షవర్మా కూడా !
తిరువనంతపురం (కేరళ) : కేరళ ఆర్టిసి ఓ సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. బస్సెక్కితే విమానంలోకెక్కినట్లు ఉంటుంది.. అచ్చు .... విమానాన్ని తలపించేలా ... లెదర్ సీట్లు, హోస్టెస్ సేవలు, ప్రతీ సీటుకు ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్లు, ఉచిత వైఫై, ప్రయాణీకులకు వేడి పానీయాలు, షవర్మా రోల్స్, స్నాక్స్, వాష్ రూం... ఒకటేమిటి బిజినెస్ క్లాస్ సౌకర్యాలన్నీ ఈ బస్సులో ఉన్నాయి.. బయటికి బస్సే ... కానీ ఎక్కితే విమానమే..! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది..!
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) ఓ ప్రీమియం బస్సును ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలతో బస్సును రూపొందించింది. తిరువనంతపురం–కొచ్చి మధ్య ఈ లగ్జరీ బస్సును నడుపుతున్నారు. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 200 నుంచి 227 కిలోమీటర్లు. బస్సులో అడుగుపెట్టగానే విలాసవంతమైన లెదర్ సీట్లు, ప్రతి సీటుకు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఉచిత వైఫైతో పాటు మొబైల్ ఫోన్ల ఛార్జింగ్‌కు సీట్ల వద్దే పోర్టులను ఏర్పాటు చేశారు. విమానంలో మాదిరిగానే హోస్టెస్ సేవలు కూడా ఈ బస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రయాణికులకు వేడి పానీయాలు, షవర్మా రోల్స్ వంటి స్నాక్స్‌ను హోస్టెస్ అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సాధారణ బస్సు ప్రయాణానికి భిన్నమైన అనుభూతిని ప్రయాణికులు పొందుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాష్‌రూమ్ సౌకర్యాన్నీ కేఎస్‌ఆర్టీసీ కల్పించింది. బస్సులోనే శుభ్రంగా నిర్వహించే వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది.
అజయ్ జానీ అనే వ్లాగర్ ఈ బస్సులోని సౌకర్యాలను వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘బిజినెస్ క్లాస్ సౌకర్యాలు ఇక అంతర్జాతీయ విమానాల్లోనే కాదు.. కేరళ కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లోనూ అందుబాటులోకి వచ్చాయి’’ అంటూ ఆయన పేర్కొన్నారు. భారతీయ రైల్వేలో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత్ రూపనగుడి కూడా ఈ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేసి కేరళ ఆర్టీసీ ప్రయత్నాన్ని అభినందించారు. సౌకర్యం, విలాసాన్ని ప్రభుత్వ రవాణాతో మేళవించిన ఈ ప్రయోగం ప్రజా రవాణాలో కొత్త ఆలోచనలకు దారితీస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.







కామెంట్‌లు (0)