ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

COVID - ఎపి పై మళ్లీ కరోనా పంజా ..!

22 జులై, 2026

Corona strikes AP again!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:01 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

అమరావతి : కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పడిపోయిన కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ నిలకడగా పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నమూనాల సేకరణలో మరో 7 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 4 కేసులు నమోదవగా, తూర్పుగోదావరి జిల్లాలో 2 కేసులు , బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు కొత్త కేసులు వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది..!


covid cases


ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి - పరీక్షలో పాజిటివ్ ..!

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు క్యాన్సర్ చికిత్స నిమిత్తం పుదుచ్చేరిలో ఉండగా, అతనికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, బాలుడి కుటుంబ సభ్యులకు, సమీప బంధువులకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలపాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక కిడ్నీ సంబంధిత సమస్యలతో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో డయాలసిస్ చేయించుకుంటోంది. జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో బాలికను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో కూడా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది.


12 పాజిటివ్ కేసులు - 4 కోవిడ్ మరణాలు ..!

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26 నుంచి జులై 16 మధ్య కాలంలో మొత్తం 12 కోవిడ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. మరణించిన వారంతా రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి కేసుల వ్యాప్తి తీవ్రంగా లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.


తాజాగా ఎపి లో కరోనా గణాంకాలు ...

ఈ తాజా కేసుల నమోదుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 26 కు చేరింది. ఇప్పటివరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనుమానితులైన 145 మందికి ఆర్టీపీసీఆర్ , ఇతర కరోనా పరీక్షలను నిర్వహించింది. జిల్లాల వారీగా వ్యాప్తి తీవ్రతను గమనిస్తే, వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదై మొదటి స్థానంలో ఉంది. ఇక బాధితుల ప్రస్తుత స్థితిని చూస్తే, 10 మంది వ్యాధి తీవ్రత దృష్ట్యా వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా, మృదువైన లక్షణాలు ఉన్న మరో 9 మంది తమ స్వగృహాల్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు.


covid


కోలుకున్నవారు.. మరణాల వెనుక నిజాలు ..!

ఇప్పటివరకు ఈ తాజా వేవ్ ‌లో మొత్తం ముగ్గురు బాధితులు కోవిడ్ వైరస్ బారిన పడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఇదే సమయంలో ఇప్పటివరకు నలుగురు రోగులు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోవడం కొంత భయాందోళనలకు గురిచేస్తోంది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య శాఖ అధికారులు.. మృతి చెందిన ఆ నలుగురికీ కొవిడ్ సోకడానికి ముందే తీవ్రమైన ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కేవలం కరోనా వల్లే వారు మరణించలేదని స్పష్టం చేశారు.


విశాఖ సీలేరు పవర్ కాంప్లెక్స్‌లో పర్యాటకంపై బ్యాన్ ..!

కరోనా కేసులు పెరుగుతున్న వేళ ... విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక , సున్నితమైన ప్రాంతమైన సీలేరులో అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి పర్యాటకులు విపరీతంగా వచ్చే సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు , మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ఇక్కడి ప్రధాన రిజర్వాయర్లను చూసేందుకు బయటి వ్యక్తులెవరూ రాకుండా ఆంక్షలు విధించారు.


విద్యుత్ కేంద్రాల్లో రెడ్ అలర్ట్.. ప్రజలకు సూచనలు ...

రాష్ట్రానికి ఎంతో కీలకమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. సిబ్బంది అంతా విధిగా మాస్కులను ధరించడం, శానిటైజేషన్ , భౌతిక దూరం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సాధారణ ప్రజలు కూడా మాస్కులు ధరిస్తూ, మాటిమాటికీ చేతులు శుభ్రం చేసుకుంటూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్