న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్లు, సిఎఎ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియాలో 2019లో చెలరేగిన హింసపై సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తీర్పులో పేర్కొన్న కారణాల దృష్ట్యా, అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నామని జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులను రెండు భాగాలుగా విభజించామని, ఒకటి ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించినది కాగా, మరొకటి జామియా మిలియా అల్లర్లకు సంబంధించినదని తీర్పును ప్రకటిస్తూ ధర్మాసనం తెలిపింది. వివరణాత్మక తీర్పు వెలువడాల్సి వుంది. ఈ పిటిషన్లపై కోర్టు జులై 24న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో, సిట్ , విచారణ కమిషన్ లేదా వాస్తవాలను నిర్ధారించే కమిటీని ఏర్పాటు చేయడం, వైద్య చికిత్స, పరిహారం మంజూరు, బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదు వంటి అంశాలపై ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. విద్వేషపూరిత ప్రసంగాలపై రాజకీయ నేతలపై కేసులు నమోదు చేయాలని, హింసపై దర్యాప్తు చేయడానికి, పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని కొన్ని పిటిషన్లలో కోరారు.








కామెంట్‌లు (0)