గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంచు కరుగుదలతో పెనుముప్పు.. వరద మరణాల్లో భారత్‌ టాప్‌ !

11 గంటల క్రితం

Melting ice poses a grave threat India tops the list in flood related deaths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : వాతావరణ మార్పుల ప్రభావంతో .... ప్రపంచవ్యాప్తంగా మంచు ప్రాంతాలు వేగంగా కరిగిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలు హెచ్చరించాయి. ఆర్కిటిక్‌ నుంచి హిమాలయాల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని వెల్లడించాయి. ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచ సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా ఉంది. గ్రీన్‌ల్యాండ్‌, అంటార్కిటికా మంచు ఫలకాలు 1990లతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా కరిగిపోతున్నాయి.


మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరగడంతోపాటు, గడ్డకట్టిన నేలల్లో నిల్వ ఉన్న భారీ మొత్తంలో కార్బన్‌ వాతావరణంలోకి విడుదలై భూతాపాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. హిమాలయాల్లో మంచు కరిగి ఏర్పడుతున్న సరస్సులు బద్దలైతే దిగువ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉంది.


1835 నుంచి 2025 వరకు హిందూకుష్‌ హిమాలయ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లో సంభవించిన హిమనదీ వరదలపై జరిగిన అధ్యయనం ప్రకారం ... వరదల సంఖ్యలో భారత్‌ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, మరణాల్లో మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో 62 వరద ఘటనల్లో 6,119 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో 1,991 మంది, చైనాలో 625 మంది మరణించారు. నమోదైన వరదల్లో సగం మంచు కొండచరియలు విరిగిపడటం వల్ల, 25 శాతం భారీ వర్షాల కారణంగా సంభవించాయి. భూతాపాన్ని నియంత్రించేందుకు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, హిమాలయ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు నివారణ చర్యలను బలోపేతం చేయాలని నివేదికలు సూచించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్