గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

TamilNadu Budget 2026 : మహిళలకు, చిన్నారులకు బంగారం

05 ఆగస్టు, 2026

Tamil Nadu Budget 2026: Vijay's Government's First Budget
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సంక్షేమానికి పెద్ద పీట

  • జెన్‌ ‌జి విద్యార్ధులకు ల్యాప్‌‌టాప్‌‌లు

  • రూ. 4,11,852 కోట్లతో విజయ్‌ ‌ప్రభుత్వం తొలి బడ్జెట్‌‌

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టివికె) ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 4,11,852 కోట్ల భారీ బడ్జెట్‌‌ను ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒకవైపు దాదాపుగా రూ.11లక్షల కోట్ల రుణ భారం మరోవైపు ఆర్ధికాభివృద్ధి, రాష్ట్ర ఆదాయాల మధ్య బంధం బలహీనపడుతున్నదని గుర్తించినప్పటికీ తమిళనాడులో విజయ్‌ ‌ప్రభుత్వం ప్రత్యక్ష సంక్షేమం, మానవ వనరుల వ్యయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్‌లో మహిళలు, విద్యార్థులు, యువత, పేద కుటుంబాలు, రైతులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేసింది. మహిళల కోసం బంగారు నాణేలు, పట్టు చీరల పథకం ప్రతిపాదించడంతో పాటు, జెన్‌-జి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైకిళ్ల పంపిణీకి ప్రభుత్వం భారీ మొత్తాన్ని కేటాయించింది. అలాగే హజ్ యాత్రకు వెళ్లే వారికి అందించే సబ్సిడీని కూడా పెంచనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి విజయ్‌ ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెడుతూ రాజకీయంగా ప్రభావం చూపే పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ టెండర్లలో అక్రమంగా వాటాలు లేదా లంచాలకు అవకాశం లేకుండా పారదర్శకత తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ద్వారా ప్రభుత్వ ఖర్చులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మహిళలకు గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు

మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు 8గ్రాముల బంగారు నాణేలు, పట్టు చీరలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం కోసం రూ.812 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన ప్రతి శిశువుకు ఒక గ్రామ్‌ ‌బంగారు ఉంగరం ఇవ్వనుంది. ఇందుకోసం రూ.560కోట్లు కేటాయించింది.

​ విద్యార్థులకు ల్యాప్‌‌టాప్‌‌లు, సైకిళ్లు

'వెట్రి మడికణిణి థిట్టం' ద్వారా కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీకి రూ. 2,000 కోట్లు కేటాయించామని విజయ్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో చదువుతున్న 11వ తరగతి విద్యార్థులకు ఆధునిక సైకిళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సైకిళ్లతో పాటు విద్యార్థులకు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు కూడా అందించనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది. యువతలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

​• మిడిల్‌ ‌స్కూల్‌ ‌విద్యార్ధులకు బ్రేక్‌‌ఫాస్ట్‌ ‌పథకాన్ని విస్తరించింది.

• వెట్రి లాప్‌‌ట్యాప్‌ ‌పథకానికి రూ.2వేల కోట్లు కేటాయించారు.

• 3700కి పైగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, రెసిడెన్షియల్‌‌స్కూళ్ళ విస్తరణకు నిర్ణయించారు. ఇందుకోసం పాఠశాల విద్యా రంగానికి రూ.44,527కోట్లు కేటాయించారు.

• ప్రసూతీ కేంద్రాలు, సంచార వృద్ధ సంరక్షణ, టెలిమెడిసిన్‌, కేన్సర్‌ ‌కేర్‌ ‌కేంద్రాలు ద్వారా ఆరోగ్య సంరక్షణను విస్తరించాలని నిర్ణయించింది.

• 12లక్షల మంది విద్యార్ధులకు, లక్షమంది నిరుద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు.

• రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్-ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

• అదనంగా, రూ.42 కోట్ల వ్యయంతో తమిళనాడు గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.

నీట్‌ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం తన వ్యతిరేక వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. నీట్‌ను రద్దు చేసి, గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్