రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో ముందడుగు
6.59 కి.మీ. సొరంగం ఛేదన పూర్తి
ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రికులకు భవిష్యత్తులో రైలు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే రిషికేశ్ - కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రుద్రప్రయాగ్ జిల్లాలో 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్-14 ప్రధాన సొరంగం తవ్వకాలను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) పూర్తి చేసినట్లు వెల్లడించింది. హిమాలయాల్లో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఈ సొరంగాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ ఏడాది జూన్‌లోనూ జోజిల టన్నెల్ బ్రేక్‌త్రూ సాధించిన సంస్థ, తాజాగా మరో కీలక నిర్మాణ మైలురాయిని చేరుకుందని పేర్కొంది. 6.59 కిలోమీటర్ల సొరంగంలో సుమేర్‌పూర్ వైపు నుంచి 4.7 కి.మీ., మారోరా వైపు నుంచి 1.79 కి.మీ. మేర తవ్వకాలు చేపట్టి అనుసంధానించారు. వదులైన మట్టి, కొండ వాలుల అస్థిరత, భూగర్భ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రీ - ఎక్స్‌కవేషన్, మల్టీ - డ్రిఫ్టింగ్, మైక్రోపైల్స్, రాక్ బోల్ట్స్, గ్రౌటింగ్ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను వినియోగించారు. నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని నియంత్రిత బ్లాస్టింగ్, ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ రైల్వే మార్గం పూర్తయితే బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు రవాణా అనుసంధానం మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం, రహదారి రద్దీ తగ్గేందుకు, పర్యాటకం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలకు ఊతం లభించే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)