మార్పునకు 68 శాతం మంది ఆసక్తి
వేతన పెంపునపై 31 శాతం మంది ఆశలు
న్యూఢిల్లీ : మెజారిటీ ఉద్యోగులు ఉన్న ఉద్యోగాలపై అనాసక్తిని కనబర్చుతున్నారు. 2027లో ఏకంగా 68.4 శాతం మంది కొత్త ఉద్యోగాల కోసం చురుగ్గా ప్రయత్నించనున్నట్లు ఫౌండ్‌ఇట్ నిర్వహించిన ‘కెరీర్ రీసెట్ సర్వే 2027’ వెల్లడించింది. ఉద్యోగ మార్పునకు ప్రధాన కారణంగా 40.3 శాతం మంది కెరీర్ ఎదుగుదలను పేర్కొనగా.. 29.7 శాతం మంది అధిక వేతనాన్ని, 20.3 శాతం మంది మెరుగైన పని, అధిక జీవన ప్రమాణాలను కోరుకుంటున్నారు. అయితే ఉద్యోగం మారేందుకు 51.5 శాతం మంది కనీసం 31 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీతం పెంపును ఆశిస్తున్నారు. అంటే కెరీర్‌లో ఎదుగుదలపై ఆకాంక్షతోపాటు భారీ వేతన పెంపునూ ఉద్యోగులు కోరుకుంటున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా 9,951 మంది ఉద్యోగుల అభిప్రాయాలతో రూపొందించిన ఈ సర్వే ప్రకారం మరో 18.1 శాతం మంది ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగుతూనే కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 3.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత సంస్థలోనే కొనసాగుతూ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. కెరీర్ ఎదుగుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే వేతన అంచనాలు కూడా ఎక్కువగా ఉండటం ఈ సర్వేలో ప్రధానంగా కనిపిస్తున్న ధోరణి అని ఫౌండ్‌ఇట్ సిఇఒ తరుణ్ సిన్హా తెలిపారు. ఎఐ నైపుణ్యాల పెంపు ఉద్యోగుల భవిష్యత్తు కెరీర్‌కు కీలకంగా మారుతోందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)