రూ.52,878 కోట్లకు విక్రయం
కెనడా సంస్థ ఫెయిర్‌ఫాక్స్ చేతికి 60.72 శాతం వాటాలు
చౌకగా వాటాల అమ్మకం
ఇక ప్రభుత్వం, ఎల్ఐసి వద్ద 34 శాతం వాటానే
బ్యాంకింగ్‌లోకి మరిన్ని ఎఫ్‌డిఐలు : మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అనుకున్నంత పని చేసింది. ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను విదేశీ సంస్థ పరం చేసింది. బ్యాంకులోని మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సాకు చెందిన ఈ సంస్థ రూ.52,878 కోట్లు (560 కోట్ల డాలర్లు) వెచ్చించి ఐడిబిఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను దక్కించుకోనుంది. ఈ విక్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (సిసిఇఎ) బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో భారత ఆర్థిక సేవల రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఒప్పందంగా నిలువనుంది. ఈ లావాదేవీ ద్వారా ఐడిబిఐ బ్యాంకు మొత్తం విలువ సుమారు రూ.87,100 కోట్లుగా లెక్కగట్టారు. అయితే.. బుధవారం నాటి షేరు ముగింపు ధర రూ.90.40తో పోలిస్తే 11 శాతం తక్కువ ధరకు చౌకగా వాటాలను విక్రయించడం గమనార్హం. దాదాపు రూ.4800 కోట్లు లబ్ధి చేకూర్చినట్లయ్యింది. ఈ ఒప్పందం తర్వాత ఐడిబిఐలో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి సంయుక్తంగా 34 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండనున్నాయని దీపమ్ కార్యదర్శి అరుణిష్ చావ్రా వెల్లడించారు.
ఈ కొనుగోలుతో భారత బ్యాంకింగ్ రంగంలో ఫెయిర్‌ఫాక్స్ తన ఉనికి మరింత విస్తరించనుంది. ఇప్పటికే సిఎస్బి బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్‌లో ఈ సంస్థకు పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఐడిబిఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు నేపథ్యంలో సిఎస్బి బ్యాంకులో ప్రస్తుతం ఉన్న 40 శాతం వాటాకు సంబంధించి నియంత్రణపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరిన రెండేళ్లలోగా సిఎస్బి బ్యాంకును విలీనం చేయడమో లేదా అందులోని వాటా నుంచి పూర్తిగా వైదొలగడమో చేయాల్సి ఉంటుందని అరుణిష్ చావ్రా తెలిపారు.
ఐడిబిఐ బ్యాంకును ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతుల్లో జాప్యం, బిడ్లకు సంబంధించిన సమస్యలతో విక్రయ ప్రక్రియ ఆలస్యమైంది. గతంలో ఫెయిర్‌ఫాక్స్ సమర్పించిన బిడ్ ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరకు చేరుకోలేదు. తాజాగా ఒప్పందం ఖరారు కావడంతో ఐడిబిఐ బ్యాంకు ప్రయివేటీకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ వాటాల విక్రయంతో కేంద్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని తన ఖాజానాలో వేసుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో రూ.80వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని మోడీ సర్కార్ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. ఐడిబిఐ బ్యాంకు వాటాల విక్రయం ద్వారానే రూ.52,878 కోట్లు సమకూరడంతో లక్ష్యంలో 66 శాతాన్ని చేరినట్లయ్యింది. గత మూడేళ్లలో ఇదే అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ ఏడాదిగా నిలిచిపోనుంది.
మైనారిటీ వాటా కొనసాగుతోంది : మంత్రి సీతారామన్
దేశీయ బ్యాంకింగ్ రంగంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐడిబిఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వాటాను కొనసాగిస్తుందని బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఐడిబిఐ బ్యాంకు పునరుద్ధరణకు ప్రభుత్వం గతంలో మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు తదుపరి దశ వృద్ధికి మార్గం సుగమం చేస్తోందన్నారు. ఈ నిర్ణయంతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతోపాటు, బ్యాంకింగ్ సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక తోడ్పాటు కల్పించడం వంటి లక్ష్యాలతో ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.








కామెంట్లు (0)