రెండో అత్యంత విలువైన కంపెనీగా నమోదు
ముంబయి : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ బుధవారం స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టింది. తొలిరోజే జియో షేర్లు 21.36శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. దీంతో ఈ షేర్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. బుధవారం ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో జియో లిస్టింగ్ సందర్భంగా సంప్రదాయ గంట మోగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ హాజరయ్యారు. ఐపిఒ ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే 21.4 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద లిస్టయిన షేరు, అనంతరం రూ.1,419కు దూసుకెళ్లింది. దీంతో ఇష్యూ ధరపై లాభం 26.81 శాతానికి చేరింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐపిఒ ధర ఆధారంగా లెక్కించిన రూ.10.31 లక్షల కోట్ల నుంచి రూ.13.07 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువకు రూ.2.76 లక్షల కోట్లు జతయ్యాయి. ఈ పరిణామంతో జియో దేశంలో రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. దేశంలోని ఐదు అతిపెద్ద పబ్లిక్ ఇష్యూల్లో అత్యధిక లిస్టింగ్ లాభాలను అందించిన ఐపిఒగా జియో నిలిచింది. లిస్టింగ్ ధర ప్రకారం షేర్‌హోల్డర్ల కేటగిరీలో 23 షేర్ల కనీస లాట్ పొందిన మదుపర్లకు రూ.5,497, రిటైల్ విభాగంలో 12 షేర్ల లాట్ పొందిన వారికి రూ.2,868 చొప్పున లాభం లభించింది. షేరు రూ.1,419కు చేరడంతో ఈ లాభాలు వరుసగా రూ.6,900, రూ.3,600కు పెరిగాయి. కాగా, జియో ఐపిఒ మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, సంస్థాగత మదుపర్ల విభాగంలో 70.55 రెట్ల బిడ్లు నమోదయ్యాయి. రూ.8,110 కోట్ల యాంకర్ ఇన్వెస్టర్ల వాటాకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా డిమాండ్ రావడం విశేషం.








కామెంట్‌లు (0)