శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Layoffs - యాపిల్ లో భారీ మార్పులు - 200 మంది ఉద్యోగులకు లేఆఫ్ లు ..!

14 గంటల క్రితం

Major changes at Apple – 200 employees laid off..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 01:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బిజినెస్ : సాంకేతిక రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యాపిల్‌ సంస్థ .. కృత్రిమ మేధ (ఎఐ) పోటీ, మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకుంటోంది. ఇందులో భాగంగా సంస్థలోని పలు విభాగాల్లో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. సిరి, విజన్ ప్రో ఇమ్మర్సివ్ వీడియో, గేమింగ్ విభాగాలకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.


ఉత్పత్తులు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. మారిన వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని పాత హోదాలను తొలగిస్తూ, కొత్త విభాగాల్లో అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయే వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.


apple employees


తొలగింపుల్లో సుమారు 100 మంది విజన్ ప్రో విభాగానికి చెందినవారు కాగా, సిరి, సాఫ్ట్‌వేర్‌ టీమ్‌ల నుంచి మరో 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 3,699 డాలర్ల ధరతో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన విజన్ ప్రో హెడ్‌సెట్‌కు ఆశించిన స్పందన రాకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా కనిపిస్తోంది. భారీ వ్యయంతో రూపొందిస్తున్న 3 డీ ఇమ్మర్సివ్ వీడియో కంటెంట్‌ తయారీని తగ్గించడంతోపాటు, విజన్ ప్రో గేమింగ్ విభాగాన్ని దాదాపుగా నిలిపివేయాలని యాపిల్‌ భావిస్తోంది. ఇకపై ఇటువంటి కంటెంట్‌ను థర్డ్‌ పార్టీ డెవలపర్ల ద్వారా అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనుంది.


మరోవైపు సిరి వాయిస్ అసిస్టెంట్‌ను ఆధునిక ఆర్కిటెక్చర్‌, కొత్త ఎఐ మోడళ్ల ఆధారంగా పూర్తిగా పునర్నిర్మించే పనిలో యాపిల్‌ ఉంది. ఈ మార్పుల్లో భాగంగా పాత సాంకేతిక నైపుణ్యాలు కలిగిన సిబ్బంది స్థానంలో ఎఐ రంగంలో నిపుణులను నియమించుకునే దిశగా అడుగులు వేస్తోంది.


అయితే ఈ పరిణామాలు విజన్ ప్రో భవిష్యత్తుపై అనుమానాలకు తావిస్తున్నప్పటికీ, విజన్ ఓఎస్‌ను కొనసాగిస్తామని యాపిల్‌ స్పష్టం చేసింది. భవిష్యత్తులో స్మార్ట్‌ గ్లాసెస్‌ ఆధారిత పరికరాలపై దృష్టి సారించడంతోపాటు, 2028 నాటికి కొత్త విజన్ ప్రో మోడల్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఎఐ రంగంలో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు యాపిల్‌ చేపడుతున్న ఈ పునర్వ్యవస్థీకరణ సంస్థ భవిష్యత్ వ్యూహంలో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ముఖ్యంగా విజన్ ప్రో, సిరి విభాగాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ టెక్నాలజీ రంగంలో చర్చకు దారితీస్తున్నాయి.
visonpro
విజన్ ప్రో ఉద్యోగులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్