ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయప్రక్రియకు మోకాలొడ్డుతున్న రిలయన్స్‌

14 గంటల క్రితం

relaince
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:37 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎన్‌‌టిపిసి గ్యాస్‌ వివాదంలో 20 ఏళ్లుగా ఆర్‌ఐఎల్‌ సాగదీత వైఖరి

- సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం - రూ.10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ : న్యాయ ప్రక్రియను ఏళ్ల తరబడి సాగదీస్తున్న భారీ కార్పొరేట్ సంస్థల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2005లో ఎన్‌టిపిసి దాఖలు చేసిన సహజ వాయువు సరఫరా వివాదం కేసును దాదాపు రెండు దశాబ్దాలుగా ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. రిలయన్స్‌కు న్యాయపరమైన పోరాటం కొనసాగించేందుకు అపారమైన ఆర్థిక వనరులు ఉన్నాయని.. ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తడం ద్వారా కేసు పురోగతిని అడ్డుకున్నట్లు కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్‌టిపిసి కేసు 2005లో దాఖలైనప్పటికీ ఇప్పటికీ సాక్ష్యాల దశలోనే ఉండటాన్ని తప్పుబట్టిన ధర్మాసనం, కేసును తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని గతంలో ఆదేశించినా ఏడేళ్లు గడిచిపోయాయని గుర్తు చేసింది.

​ప్రతీ దశలో అడ్డంకులు..

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం రిలయన్స్ అనుసరించిన దావా విధానంపై శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2005లో దాఖలైన ఈ కేసు ఇప్పటికీ సాక్ష్యాల దశలోనే ఉండిపోవడంపై, ప్రతి దశలోనూ రిలయన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆలస్యం చేయడంపై మండిపడింది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేసును అడ్డుకోవడంలో ఆర్థిక వనరులకు కొదవ లేదు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడంలో సహాయ పడాలనే బాధ్యత కూడా వారికి ఉన్నట్లు కనిపించడం లేదు. బహుశా ప్రతి దశలో ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తడం, ట్రయల్ కోర్టు దానిని తిరస్కరించినప్పుడు అప్పీలు లేదా స్పెషల్ లీవ్ పిటిషన్ల ద్వారా పైకోర్టులకు వెళ్లడం వారి వ్యాపార వ్యూహానికి లాభదాయకంగా ఉందేమో. 2005లో ఎన్‌‌టిపిసి దాఖలు చేసిన ఈ దావా ఇప్పటికీ ముందుకు సాగకపోవడం తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ప్రతి దశలోనూ అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. రెండు దశాబ్దాలు గడిచినా కేసు ఇంకా సాక్ష్యాల విచారణ దశలోనే ఉంది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

​న్యాయస్థానాల పనితీరుపై ప్రభావం

తన సాక్షి బికె గంగూలీ అఫిడవిట్లలోని కొన్ని అంశాలను తొలగించాలన్న బాంబే హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ ఆర్‌ఐఎల్‌ వేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఈ జరిమానా విధించింది. ఈ రూ.10 లక్షల మొత్తాన్ని ఐదు వారాల్లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఒక పక్షానికి కేసును సుదీర్ఘకాలం సాగదీసే అవకాశం ఇవ్వడం న్యాయస్థానాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ.. బాంబే హైకోర్టును ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది.​2003లో ఎన్‌టిపిసి నిర్వహించిన అంతర్జాతీయ టెండర్‌లో విజేతగా నిలిచిన రిలయన్స్ కెజి-డి6 క్షేత్రం నుంచి 17 ఏళ్ల పాటు ఏటా 132 ట్రిలియన్ బిటియు సహజవాయువును ఎంబిటియుకు 2.34 డాలర్ల ధరకు సరఫరా చేయడానికి 2004లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. అయితే గ్యాస్ సేల్ అండ్ పర్చేజ్ అగ్రిమెంట్ (జిఎస్‌‌పిఎ)లోని కీలక అంశాలపై రిలయన్స్ అభ్యంతరాలు తెలపడంతో 2005 డిసెంబర్‌లో ఎన్‌టిపిసి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు సుదీర్ఘ న్యాయపోరాటంగా కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్