సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.5 లక్షల కోట్లు ఆవిరి

7 గంటల క్రితం

sensex
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 07:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, చమురు ధరలు పెరగడం మన మార్కెట్‌పై ప్రభావం పడింది. దేశీయంగా ప్రైవేటురంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడమూ సూచీలపై ఒత్తిడి పడింది. సెన్సెక్స్‌ ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 22,900 దిగువకు చేరింది. మదుపర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరై రూ.467 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ 876.37 పాయింట్ల నష్టంతో 73,852.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 257.20 పాయింట్ల నష్టంతో 22,888.95 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.92గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బిఐ, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టి, ఇండిగో, మారుతీ సుజుకీ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ట్రెంట్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 108 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 4,167 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కారణాలు ఇవీ..

యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో వాటి షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ దాదాపు 5 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2 శాతం మేర నష్టపోవడం సూచీలపై ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ 108 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. దీనికితోడు అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోగా.. సోమవారం ఆసియా మార్కెట్‌లు కూడా నష్టాల్లో కదలాడాయి. ఆ ప్రభావమూ మన స్టాక్‌ మార్కెట్‌పై పడింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ 2 శాతానికి పైగా లాభపడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనికితోడు మంగళవారం మార్కెట్ సెలవు ఉండడంతో లాభాల స్వీకరణకు దిగారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండడం మరో కారణం. ఈ నెలలో 11 సెషన్లలో 9 రోజుల పాటు ఎఫ్‌ఐఐలు నికరంగా విక్రయాలవైపే ఉన్నారు. నిరంతరం నిధులు తరలించడంపైనా మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్