- నాలుగు వారాల ర్యాలీకి బ్రేక్..
ముంబయి : దలాల్ స్ర్టీట్ నాలుగు వారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. చమురు ధరల భయాలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 989.33 పాయింట్లు (1.17 శాతం) పడిపోయి 83,339కు దిగజారింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 277 పాయింట్లు (1.07 శాతం) క్షీణించి 25,607 వద్ద ముగిసింది. ఐటి దిగ్గజాల షేర్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో లాభాల స్వీకరణ, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, దేశీయ బాండ్ రాబడుల పెరుగుదల మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ముడి చమురు 97.22 డాలర్లకు చేరడం కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఐటి, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. టిసిఎస్ 2.82 శాతం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2.81 శాతం, ఇన్ఫోసిస్ 2.55 శాతం, టెక్ మహీంద్రా 2.15 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. రంగాల వారీగా ఐటి 1.88 శాతం, ఆటో 1.48 శాతం, రియల్టీ 1.43 శాతం పడిపోయాయి. రూపాయి బలహీనత, చమురు ధరల పెరుగుదల, దేశీయ బాండ్ రాబడులు అధికమవడంతో భారీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.








కామెంట్‌లు (0)