హైవేలు, విద్యుత్, పోర్టుల విక్రయ లక్ష్యం
బొగ్గు, గనుల రంగాలపైనా కేంద్రం దృష్టి..
న్యూఢిల్లీ : ప్రజల విలువైన మౌలిక రంగాల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని మోడీ సర్కార్ మరింత వేగవంతం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ముగిసే కల్లా రూ.2.9 లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ (అసెట్ మానిటైజేషన్) చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ రహదారులు, విద్యుత్, పోర్టులు, బొగ్గు, గనుల రంగాల్లో ఆస్తుల నగదీకరణ ద్వారా ఈ నిధులు సమకూరనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపి) 2.0లో భాగంగా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగించి నిధులు సమీకరించాలని యోచన. 2026-27లో రూ.3.26 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇందులో 80 నుంచి 90 శాతం వరకు సాధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా అమ్మకాలు, బదిలీలు జరిగాయని తెలిపాయి. 2025-26లో రూ.2.49 లక్షల కోట్ల లక్ష్యంలో సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మేశారు. ఎన్ఎంపి 2.0లో భాగంగా 2026 నుంచి 2030 వరకు 12 రంగాల్లో మొత్తం రూ.16.72 లక్షల కోట్ల ఆస్తుల నగదీకరణ చేపట్టాలని మోడీ సర్కార్ ప్రధాన లక్ష్యంగా ఉంది. జాతీయ రహదారుల రంగంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) నిర్మాణం- నిర్వహణ -బదిలీ విధానం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల సమీకరణను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో బిఒటి ప్రాజెక్టుల ద్వారా ఒక్కటే సుమారు రూ.60 వేల కోట్ల సమీకరణ జరగవచ్చని అంచనా. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఎన్హెచ్ఎఐ ఇన్విట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. బొగ్గు బ్లాకుల వాణిజ్య వేలం, కోల్ ఇండియా అనుబంధ సంస్థల్లో వాటాల తగ్గింపు, గనుల లీజులు, లైసెన్స్ బ్లాకుల వేలం ద్వారా సుమారు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు, ఆదాయం సమకూరవచ్చని అంచనా. ఈ మొత్తంలో అధిక భాగం రాష్ట్ర ప్రభుత్వాలకు, కొంత కేంద్రానికి చేరనుంది. విద్యుత్ సరఫరా రంగంలో లీజింగ్ ద్వారా, పోర్టులు-షిప్పింగ్ రంగాల్లో పిపిపి బెర్త్‌లు, టెర్మినల్ రాయితీల ద్వారా ఒక్కో రంగం నుంచి సుమారు రూ.50 వేల కోట్ల చొప్పున సమీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. రైల్వే రంగంలో వాటాల విక్రయం, రైల్వే భూముల అభివృద్ధి, ఫ్రైట్ షెడ్ల అభివృద్ధి ద్వారా 2026-27లో సుమారు రూ.30 వేల కోట్ల ఆస్తుల నగదీకరణకు అవకాశం ఉందని అంచనా.








కామెంట్లు (0)