పొరుగు దేశాలకే ఎక్కువ ప్రయోజనం
తగ్గుతున్న యుఎస్ ఆర్డర్లు
ఆందోళనలో పరిశ్రమలు
న్యూఢిల్లీ : అమెరికా తాజా టారిఫ్ ప్రతిపాదనలు భారత ఎగుమతిదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోన్నాయి. అధిక తయారీ సామర్థ్యంపై అమెరికా చేపట్టిన సెక్షన్ 301 విచారణ పరిధిలో భారత్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి దేశాలు ఈ తాజా విచారణ పరిధిలో లేకపోవడం విశేషం. దీంతో ఆయా దేశాలపై తక్కువ సుంకాలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్‌పై ఏకంగా 25 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా ముందుకు తెచ్చింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రేటు 17 శాతానికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. సుంకాలపై స్పష్టత లేకపోవడం, అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియకపోవడంతో అమెరికా కొనుగోలుదారుల నుంచి ఆర్డర్లు తగ్గపోయాయని భారత ఎగుమతిదారులు, పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.
పాకిస్థాన్‌పై 7 శాతమే..!
అధిక తయారీ సామర్థ్యం, ఉత్పత్తి విధానాలపై అమెరికా 16 ఆర్థిక వ్యవస్థలపై విచారణ ప్రారంభించింది. తాజా ప్రతిపాదిత అదిక సుంకాలు 14 దేశాలకు వర్తించేలా ఉన్నాయి. మెక్సికో, నార్వేను మినహాయించింది. అయితే భారత్‌కు పోటీగా ఎగుమతులు చేసే పాకిస్థాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి దేశాలు అధిక టారిఫ్‌ల జాబితాలో లేకపోవడంతో అమెరికా మార్కెట్‌లో ధరల పరంగా వాటికి అధిక ప్రయోజనం కలగనుంది. దీంతో ఆయా దేశాల ఉత్పత్తుల దిగుమతులపై తక్కువ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. మరోవైపు భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తే ఇక్కడి ఉత్పత్తులు యుఎస్‌లో ప్రియం కానున్నాయి. దీంతో పోటీ పడలేక మన ఎగుమతులు క్షీణించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా అధిక ఉత్పత్తి సామర్థ్య విచారణ పరిధిలో పాకిస్థాన్ లేదని వాణిజ్య నిపుణుడు అభిజిత్ దాస్ పేర్కొన్నారు. దీంతో పొరుగు దేశంపై 7 శాతమే సుంకాలు ఉండొచ్చని.. అదే జరిగితే ఆ దేశం ఎగుమతుల్లో అధిక ప్రయోజనం పొందనుందన్నారు.
ఆర్డర్లలో స్తబ్దత..
టారిఫ్ రేటు ఎంత? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇప్పటికే ఉన్న ఇతర సుంకాలపై అదనంగా వేస్తుందా..? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో అమెరికా కొనుగోలుదారులు దిగుమతుల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తున్నారు. అనేక రంగాల ఆర్డర్లలో స్తబ్దత నెలకొందని ఎగుమతిదారులు పేర్కొన్నారు. యుఎస్ తాజా ప్రకటన అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితిని పెంచిందని, స్పష్టత వచ్చే వరకు ఎగుమతిదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని టెక్నోక్రాట్ ఇండస్ట్రీస్ సిఎండి ఎస్.కె. సరాఫ్ పేర్కొన్నారు.
తాజా విచారణ నివేదికలో పారదర్శకత లోపించిందని, వ్యాపారాలకు అనిశ్చితి పెరిగిందని మరో వాణిజ్య నిపుణుడు బిస్వజిత్ ధర్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రతిపాదిత సుంకాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ఎగుమతిదారులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌పై అమెరికా ప్రతిపాదించిన 25 శాతం సుంకాలను సిపిఎం పొలిట్‌బ్యూరో ఖండించిన విషయం తెలిసిందే. ఒప్పంద చర్చల్లో అమెరికా ప్రయోజనాలకు భారత్ లొంగేలా ఒత్తిడి చేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం లాంటి చర్యలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఏకపక్ష ఒత్తిడి చర్యలను గట్టిగా వ్యతిరేకించాల్సిన మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించలేదని తీవ్రంగా విమర్శించింది.








కామెంట్‌లు (0)