ముంబయి : ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మరింత బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ వచ్చే ఐదేళ్లకు భారీ వృద్ధి ప్రణాళికను ప్రకటించింది. ఆటోమొబైల్ వ్యాపారాన్ని 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.6 లక్షల కోట్లు) ఆదాయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా భారత్‌లోని వ్యాపార విస్తరణ కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) విభాగాల సమిష్టి వృద్ధితో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో ప్యాసింజర్ వాహనాల విభాగం ద్వారా 60 బిలియన్ డాలర్ల ఆదాయం, అందులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచే 45-50 బిలియన్ డాలర్లు వచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వాణిజ్య వాహనాల విభాగం నుంచి మరో 40 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు, మొత్తం వ్యాపారం ద్వారా 5 బిలియన్ డాలర్లకు పైగా లాభాలను సాధించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) మార్కెట్‌లో టాటా మోటార్స్ ప్రస్తుతం దాదాపు 42 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని.. ఈ ఆధిపత్యాన్ని రాబోయే కాలంలో 40-45 శాతం స్థాయిలో కొనసాగించడమే తమ వ్యూహమని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)