- భారత్‌లో 12 శాతం మందికి కోత
బెర్లిన్/న్యూఢిల్లీ : ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఫోక్స్‌వ్యాగన్ భారీ ఉద్వాసనలకు తెరలేపింది. గ్లోబల్ ఆటో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో లక్ష మందిని ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇది ఆ కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం కావడం ఆందోళకరం. ఈ ఏడాది మార్చిలో 50,000 ఉద్యోగాల కోతను ప్రకటించగా.. తాజాగా మరో 50,000 ఉద్యోగులను తొలగించే ప్రణాళికకు ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 1,00,000 మంది సిబ్బందికి ఎసరు పెట్టనుంది. జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో 2023లో 275,000 మంది ఉండగా, 2026 జూన్ 30 నాటికి ఆ సంఖ్య 254,000 కు పడిపోయింది. తాజా చర్యలతో మరింత వేలాది మంది బతుకుదెరువును కోల్పోనున్నారు.
భారత్‌లో 1000 మందిపై వేటు..!
అంతర్జాతీయ ప్రక్షాళనలో భాగంగా భారత్‌లోనూ ఉద్వాసనలకు సిద్దం అయ్యింది. ఇక్కడి యూనిట్ అయిన స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో సుమారు 12 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. భారత్‌లో ఈ గ్రూప్‌లో దాదాపు 9వేల మంది వరకు పని చేస్తోన్నారని సమాచారం. తాజా చర్యలతో దాదాపు 1000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారని స్పష్టమవుతోంది. వచ్చే మూడేళ్లలో ఖర్చులను భారీగా తగ్గించుకునే లక్ష్యంతో ఈ కోతలు చోటు చేసుకోనున్నాయి. భారత కార్యకలాపాలలో కోట్లాది డాలర్ల రెవెన్యూను ఆదా చేసుకోవడమే ఆ కంపనీ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. కాగా.. ఉద్యోగుల తొలగింపు సంఖ్యపై వస్తున్న ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పీయూష్ అరోరా తెలిపారు. భవిష్యత్తులో దేశీయ ఇంజనీరింగ్ బృందాన్ని విస్తరించడంతో పాటు, భారత్‌ను ఫోక్స్‌వాగన్ గ్రూప్ తరఫున ఒక కీలక తయారీ, ఇంజనీరింగ్, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు పెట్టుబడులను మరింతగా పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లో తమ వ్యాపార యాజమాన్య విధానంలోనూ మార్పులు తెచ్చే దిశగా బిలియనీర్ సజ్జన్ జిందాల్‌కు చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌తో చర్చలు జరుపుతుండటం గమనార్హం.
జర్మనీలో ప్రధాన ప్లాంట్లు మూత..
ఈ ప్రక్షాళనలో భాగంగా హనోవర్, ఎండెం, జ్వికావ్, నెకార్‌సల్మ్‌లలోని నాలుగు ప్రధాన జర్మన్ ప్లాంట్ల దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జర్మనీలో ఫోక్స్‌వ్యాగన్ ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడటం చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. తయారీ ప్లాంట్లు, వాటిపై ఆధారపడిన స్థానిక సరఫరాదారులు ఆ ప్రాంతం మొత్తానికి ఇంజిన్ లాంటివని, ఇవి మూతపడితే తీవ్ర ప్రభావం పడుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని సిఇఒ ఆలివర్ బ్లూమ్ స్పష్టం చేశారు. ఈ భారీ తొలగింపులకు సంబంధించి సమయం, ప్రాంతాల వారీగా ఉద్యోగాల కేటాయింపు వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ భవిష్యత్తులో ఉత్తర అమెరికాపై దృష్టి సారించడంతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలకు ఎగుమతులను విస్తరించాలని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది. తమ ఆధీనంలో ఉన్న వ్యాపారాలు, సంస్థల సంఖ్యను మూడింట ఒక వంతుకు తగ్గించుకోవడం నూతన ప్రణాళికలో కీలక భాగమని కంపెనీ తెలిపింది.








కామెంట్‌లు (0)