న్యూఢిల్లీ: దేశంలో టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో మరింత పెరిగింది. జూలైలో 9.78శాతంగా ఉన్న టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.92శాతానికి చేరింది. వరుసగా నాలుగో నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం దాదాపు 10శాతం స్థాయిలో కొనసాగింది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో పాటు ఇంధనం, విద్యుత్, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూలైలో 6.65శాతం ఉండగా ఆగస్టులో 7.05 శాతానికి పెరిగింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.29శాతం నుంచి 8.37శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. ఈ విభాగంలో ద్రవ్యోల్బణం జూలైలో 20.05శాతం ఉండగా ఆగస్టులో 22.93శాతానికి పెరిగింది. ముఖ్యంగా పెట్రోలియం, సహజవాయువు ధరలు 34.41శాతం పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల దేశీయ ధరలపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)