మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

WPI: టోకు ధరల సెగ..

16 గంటల క్రితం

Wholesale
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 12:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డబ్ల్యుపిఐ 12.29 శాతానికి చేరిక

  • ఇప్పటికే ఎగిసిన రిటైల్‌ ధరలు..

  • పొంచి ఉన్న వడ్డీ భారం ముప్పు

న్యూఢిల్లీ: ధరల కట్టడిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలం కావడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు టోకు ద్రవ్యోల్బణం మరో ముప్పుగా మారింది. ఇంధనం, విద్యుత్‌ ధరలు ఎగిసిపడటంతో ఈ ఏడాది అక్టోబర్‌‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) 12.29 శాతానికి చేరింది. సెప్టెంబరులో 11.39 శాతంగా ఉన్న ఈ రేటు నెల రోజుల్లోనే 0.90 శాతం పాయింట్లు పెరిగింది. మొత్తం పెరుగుదలలో ఇంధనం, విద్యుత్‌ విభాగం వాటా 0.83 శాతం పాయింట్లుగా ఉందని సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 25.85 శాతం ఉండగా.. అక్టోబరులో ఏకంగా 32.84 శాతానికి చేరింది. ప్రాథమిక వస్తువులు, తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల కూడా టోకు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. ఇంధనం, విద్యుత్‌, ముడిసరుకుల ధరలు పెరగడంతో పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు మరింత భారమయ్యే అవకాశం ఉండటంతో ఈ భారం క్రమంగా వస్తు, సేవల ధరలకు బదిలీ అయితే చివరకు వినియోగదారుల జేబులపైనా మరింత ప్రభావం పడనుంది. గడిచిన నెలలో ఆహార పదార్థాలు, ఆహారేతర ముడి సరుకులు, ఇంధనాలు తదితర ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 8.67 శాతం నుంచి 9.24 శాతానికి చేరింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 9.76 శాతం నుంచి 9.54 శాతానికి తగ్గింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్‌, ఖనిజ నూనెలు, ప్రాథమిక లోహాలు, రసాయనాలు, వస్త్రాలు, రబ్బరు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ధరలు పెరిగి పరిశ్రమల వ్యయాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో 5.54 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ అక్టోబరులో 6.09 శాతానికి ఎగబాకింది. ఇది ఆర్‌‌బిఐ నిర్దేశించుకున్న గరిష్ట ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువ కావడం ఆందోళనకరం. రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం కూడా 7.74 శాతం నుంచి 8.94 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉల్లి ధరల పెరుగుదల ఏకంగా 116.22 శాతంగా నమోదైంది, వెల్లుల్లి ధరలు సైతం 60.74 శాతం పెరిగాయి. అటు టోకు ధరలు, ఇటు రిటైల్‌ ద్రవ్యోల్బణం అమాంతం పెరగడంతో సమీప భవిష్యత్తులో ఆర్‌‌బిఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లతో రుణ గ్రహీతలపై భారం పడుతోంది.

అక్టోబర్‌‌లో టోకు ధరల పెరుగుదలను వినియోగదారులకు బదిలీ చేస్తే ప్రజల గృహ బడ్జెట్‌‌పై మరింత ఒత్తిడి పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరల కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్