ఆదివారం ఉదయాన్నే ఎనిమిదేళ్ల చింటూ చేతిలో ఓ చిన్న ప్లాస్టిక్ బకెట్ పట్టుకుని, పరుగు పరుగున పెరట్లోకి వెళ్లాడు. ఆ బకెట్‌లో అమ్మ బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి. వాటిని పెరటి చివరన ఉన్న ఒక చిన్న జామ మొక్క మొదట్లో పోశాడు. గత ఏడాది తన పుట్టినరోజున ఆ మొక్కను చింటూ నాటాడు. దానికి ‘చిట్టీ’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. రోజూ స్కూలుకు వెళ్లేముందు, వచ్చాక చిట్టీతో మాట్లాడటం చింటూకి అలవాటు.
అంతలో పక్కింటి శృతి అక్క పెరట్లోకి వచ్చి ఎగతాళిగా నవ్వుతూ, ‘ఏంటి చింటూ..! రోజూ ఆ మొక్కతో ఏంటో గుసగుసలుగా మాట్లాడుతున్నావు? దానికి నీ మాటలు ఏమైనా వినబడతాయా ఏంటి?` అని అడిగింది.
చింటూ చాలా నమ్మకంగా, ‘ఎందుకు వినబడవు అక్కా..! నేను నీళ్లు పోసినప్పుడు చిట్టీ ఆకులు మెరుస్తూ ఎలా ఊగుతాయో చూశావా? అంటే అది నాకు థాంక్స్ చెప్తోందన్నమాట..!` అన్నాడు. శృతి అక్క ఆ మాటలకి మురిసిపోతూ వెళ్లిపోయింది.
కొన్ని రోజులు గడిచాయి. వేసవి కాలం ముదిరింది. ఎండలు మండిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో చింటూ ఉంటున్న కాలనీలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు వెడల్పు చేస్తున్నారని, అందుకోసం రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద వేప చెట్లు, రావి చెట్లను నరికేయడానికి అధికారులు గుర్తులు పెట్టారని తెలిసింది.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి చింటూ మనసు బాగోలేదు. గబగబా వాళ్ల నాన్న దగ్గరికి పరిగెత్తాడు. ‘నాన్నా! ఆ పెద్ద చెట్లను నరికేస్తే వాటిపై ఉన్న పక్షుల గూళ్లు ఏమైపోతాయి? ఆ నీడ ఏమైపోతుంది? అసలు చెట్లు లేకపోతే మనకి ఆక్సిజన్ ఎలా వస్తుంది నాన్నా?` అని ఆరాటంగా అడిగాడు. నాన్న చింటూ తల నిమురుతూ, ‘నువ్వు చెప్పింది నిజమే చింటూ..! చెట్లు లేకపోతే పర్యావరణం దెబ్బతింటుంది` అన్నారు బాధగా.
చింటూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘నాన్నా..! మరి మన చిట్టీని కూడా నరికేస్తారా…!?` అని ఏడుపు ముఖం పెట్టాడు. నాన్న నవ్వి..! ‘మన పెరడు రోడ్డు పరిధిలోకి రాదులే నాన్నా.. కానీ బయట ఉన్న పెద్ద చెట్లను నరకడం కూడా తప్పే, వాటిని కాపాడుకోవాలి` అన్నారు.
నాన్న మాటలతో చింటూ ఊరికే కూర్చోలేదు. సాయంత్రం కాగానే తన ఫ్రెండ్స్ గ్రూప్—అమ్ము, నిఖిల్, రాహుల్ అందరినీ పోగు చేశాడు.
’పెద్దవాళ్లేమో స్వార్థంతో చెట్లను నరుకుతున్నారు. మనం వాటిని కాపాడుకోవాలి. ఏం చేద్దాం?` అని అడిగాడు చింటూ.
‘మనం చిన్నపిల్లలం కదా చింటూ..! పెద్దవాళ్లను మనం ఎలా ఆపగలం?` అంది అమ్ము నిరాశగా.
‘ఎందుకు ఆపలేం? నిన్ననే మా క్లాస్ టీచర్ చెప్పారు. పూర్వం ‘చిప్కో ఉద్యమం’ అని ఒకటి జరిగింది. చెట్లను నరకకుండా జనాలు వాటిని కౌగిలించుకుని నిలబడ్డారంట. మనం కూడా అలాగే చేద్దాం. రేపు ఉదయం అందరూ వచ్చేయండి` అన్నాడు చింటూ ఉత్సాహంగా. మరుసటి రోజు ఉదయాన్నే చెట్టు నరికేందుకు కార్మికులు గొడ్డళ్లు, రంపాలతో కాలనీకి వచ్చారు. మొదట వేపచెట్టును నరకడానికి ఒక కార్మికుడు గొడ్డలి పైకెత్తాడు. అంతలో.. ‘ఆగండి! ఆపండి!` అంటూ ఒక్కసారిగా చింటూ గ్యాంగ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఐదుగురు పిల్లలు ఆ పెద్ద వేపచెట్టు చుట్టూ చేతులు పట్టుకుని, చెట్టును గట్టిగా కౌగిలించుకుని నిలబడ్డారు.
‘ఈ చెట్టును నరకనివ్వం..! ఇది మా పక్షుల ఇల్లు..!` అని గట్టిగా నినాదాలు చేశారు. కార్మికులు ఆశ్చర్యపోయారు. ‘పిల్లలూ..! పక్కకు తప్పుకోండి. ఇది ప్రభుత్వ ఆదేశం. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి` అన్నారు. కానీ పిల్లలు అస్సలు కదలలేదు. ‘చెట్లను నరికితే మాకు ఊపిరి అందదు. మాకు చల్లని నీడ ఉండదు. ప్లీజ్.. ఈ చెట్లను నరకకండి` అంటూ ఏడవడం మొదలుపెట్టారు.
పిల్లల గొడవ చూసి కాలనీ పెద్దలు, చింటూ తల్లిదండ్రులు, రోడ్డు కాంట్రాక్టర్ కూడా అక్కడికి వచ్చారు. పిల్లల పర్యావరణ ప్రేమని చూసి కాంట్రాక్టర్, ‘ఏంటి బాబు ఇది? రోడ్డు వేయకపోతే ఎలా?` అన్నాడు.
అప్పుడు చింటూ నాన్న ముందుకొచ్చి, ‘నిజమే సార్, పిల్లలకి ఉన్న జ్ఞానం మనకి లేకుండా పోయింది. ఈ చెట్లను నరకకుండా రోడ్డును కొంచెం పక్కనుంచి డిజైన్ చేయలేరా? ప్లీజ్ కొంచెం ఆలోచించండి` అని కోరారు.
పిల్లల కళ్లల్లోని ఆరాటం, పెద్దల మద్దతు చూసి కాంట్రాక్టర్ మనసు కరిగింది. వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడాడు. చివరకు ఫోన్ పెట్టేసి నవ్వుతూ.. ‘సరే పిల్లలూ..! మీరే గెలిచారు. ఈ నాలుగు పెద్ద చెట్లను నరకకుండా, రోడ్డును కొద్దిగా మళ్లించి వేస్తాం` అని ప్రకటించాడు.
ఆనందంతో కాలనీ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పిల్లలు ‘థాంక్యూ అంకుల్` అంటూ గంతులు వేశారు.
సాయంత్రం చింటూ సంతోషంగా పెరట్లోకి వెళ్లాడు. జామ మొక్క ‘చిట్టీ’కి నీళ్లు పోశాడు. సాయంత్రపు చల్లని గాలికి చిట్టీ ఆకులు గలగలా కదిలాయి. ఈసారి చింటూకి అనిపించింది.. చిట్టీ కేవలం థాంక్స్ చెప్పడం లేదు, తన స్నేహితుడు చేసిన గొప్ప పనికి గర్వంగా నవ్వుతోంది అని!.*
నల్ల సాయి ప్రశాంతి
6వ తరగతి,
అభ్యాస్ స్కూల్, రాజాం.








కామెంట్‌లు (0)