ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హంపీ పర్యటన.. ఓ మధురానుభూతి!

3 గంటల క్రితం

hampi tour .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 06:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌!

మన చుట్టూ సమాజంలో జరిగే పరిణామాలను తెలుసుకోవాలనే కుతూహలం నాలో ఎక్కువ. పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించటానికి ఇష్టపడతాను. ఇటీవల మా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులమైన మమ్మల్ని నాలుగు రోజుల క్షేత్రస్థాయి పర్యటనకు కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి తీసుకెళ్లారు. బస్సు ఎక్కినప్పటి నుంచి మా సందడి మొదలైంది. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించాం. మార్గమధ్యలో కనిపించిన పంట పొలాలు, పల్లెటూళ్లు, ప్రకృతి అందాలను చూస్తూ ముందుకు సాగాం. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు దాటి కర్ణాటకలోకి అడుగుపెట్టడం నాకు కొత్త అనుభూతినిచ్చింది. దారిలో కనిపించిన ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానం, పరిసరాలను గమనిస్తూ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ప్రయాణం ఎప్పుడు పూర్తయిందో తెలియనంతగా స్నేహితులతో సరదాగా గడిపాం. హంపీ చేరుకున్నాక అక్కడి చారిత్రక కట్టడాలను చూసి ఆశ్చర్యపోయాం. ముందుగా విరూపాక్ష ఆలయాన్ని, హంపీ బజారు వీధులను సందర్శించాం. ఆ తర్వాత విజయ విఠల ఆలయానికి వెళ్లాం. అక్కడి ప్రసిద్ధ రాతి రథం, సంగీత స్తంభాలు మమ్మల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటి నిర్మాణ నైపుణ్యం గురించి ఉపాధ్యాయులు వివరించిన విషయాలను ఆసక్తిగా విన్నాం. రాయలవారి ప్రాంతంలో లోటస్‌ మహల్‌, ఏనుగుల శాలలు, మహానవమి దిబ్బ, హజార రామాలయాన్ని చూశాం. అప్పటి రాజుల పాలన, రాజభవనాల నిర్మాణం, శిల్పకళా వైభవం గురించి తెలుసుకున్నాం. హేమకూట కొండపై ప్రకృతి అందాలను ఆస్వాదించాం. భారీ ఏకశిలా ఉగ్ర నరసింహస్వామి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాం. తుంగభద్ర నదీ తీరానికి వెళ్లి, అక్కడి అందాలను వీక్షించాం. నదిలో తెప్ప ప్రయాణం మరో కొత్త అనుభూతినిచ్చింది. నాలుగు రోజులపాటు స్నేహితులతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. చదువుతోపాటు ఇలాంటి క్షేత్రస్థాయి పర్యటనలు విజ్ఞానాన్ని, అనుభవాన్ని పెంచుతాయని తెలుసుకున్నాం. ఈ నాలుగు రోజుల పర్యటన మా పదో తరగతి విద్యార్థులందరికీ గుర్తుండిపోయే మధురానుభూతి!

vallabhaneni abhijit chakravarthi .jpg
వల్లభనేని అభిజిత్‌ చక్రవర్తి

10వ తరగతి, మద్ది సుబ్బారావు ఇంగ్లీషు

మీడియం హైస్కూల్‌, కొత్తపేట, వన్‌టౌన్‌,

విజయవాడ.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్